సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ ఘనతలు – తప్పక వినండి

సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ ఘనతలు – తప్పక వినండి , కేవలం 5 నిముషాలు
https://youtu.be/CvXZ0XJRynE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అల్హందులిల్లాహ్. ప్రియులారా! సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ యొక్క ఘనతలో ఈ కొన్ని హదీసులను శ్రద్ధగా వినండి. మరియు అధికంగా ఈ యొక్క జిక్ర్ చేస్తూ ఉండే ప్రయత్నం చేయండి. అల్లాహ్ నాకు మీకు మనందరికీ ఈ యొక్క జిక్ర్ అధికంగా చేసేటటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక.

మొదటి హదీస్ షేక్ అల్బాని రహిమహుల్లాహ్ సహీహలో ప్రస్తావించారు.నూహ్ అలైహిస్సలాం మరణం సమీపించినప్పుడు తన కొడుకును దగ్గరకు పిలుచుకొని, నాన్నా నా కుమారుడా! నేను నీకు రెండు విషయాల గురించి వాంగ్మూలం (వసియత్) చేస్తున్నాను. నేను రెండు విషయాల గురించి ఆదేశిస్తున్నాను, శ్రద్ధగా వాటిని నీవు పాటించు. ఒకటి లా ఇలాహ ఇల్లల్లాహ్, దీనిపై చాలా స్థిరంగా ఉండు. ఎందుకంటే ఈ లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క ఘనత ఎంత గొప్పదంటే మొత్తం భూమ్యాకాశాలు ఈ విశ్వమంతా కూడా ఒక రింగు మాదిరిగా చేసేస్తే లా ఇలాహ ఇల్లల్లాహ్ ఆ రింగును విరగ్గొట్టే అంతటి శక్తి గలది. మరియు అధికంగా సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ పలుకుతూ ఉండు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి సృష్టి యొక్క ఆరాధన అదే. దాని ద్వారానే వాటికి ఉపాధి లభిస్తుంది.

రెండవ హదీస్ సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం లో వచ్చినది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ అని ఎవరైతే ఒక రోజులో 100 సార్లు పలుకుతారో వారి పాపాలు మన్నించబడతాయి. వారి పాపాలన్నీ కూడా తుడిచివేయబడతాయి. ఒకవేళ అవి సముద్రపు నురుగంత ఉన్నా సరే.

మూడవ హదీస్ షేక్ అల్బాని రహిమహుల్లాహ్ సహీహ్ అత్ తర్గీబ్ లో ప్రస్తావించారు. ఎవరైతే సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ ఒక్కసారి పలుకుతారో వారి కొరకు స్వర్గంలో ఒక ఖర్జూరపు చెట్టు నాటబడుతుంది.

నాలుగవ హదీస్ సహీహ్ ముస్లిం షరీఫ్ లోనిది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. నిశ్చయంగా అల్లాహ్ కు అత్యంత ప్రియమైన పలుకుల్లో ఒకటి సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ.

ఐదవ హదీస్ షేక్ అల్బాని రహమహుల్లాహ్ సహీహ్ అత్ తర్గీబ్ లో ప్రస్తావించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: రాత్రి మేల్కొని నిలబడి అల్లాహ్ యొక్క ఆరాధన చేయడం, నమాజ్ లో తిలావత్ (ఖురాన్ పారాయణం చేయడం) చాలా కష్టతరంగా అవుతుందో, చేయలేకపోతున్నారో, అలాగే ఎవరి వద్దనైతే డబ్బు ధనము ఉండి ఖర్చు చేయలేకపోతున్నారో, పిసినారితనం వహిస్తున్నారో, లేదా శత్రువు ముందుకు వచ్చినా అతనితో పోరాడే అటువంటి శక్తి లేక పిరికితనం వహిస్తున్నాడో, ప్రత్యేకంగా ఇలాంటి వారు అధికంగా సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ అని పలుకుతూ ఉండాలి, ఎందుకంటే, ఈ సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ పలకడం వారు, బంగారపు పర్వతాలు, మరియు వెండి పర్వతాలు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం కంటే కూడా అల్లాహ్ కి చాలా ప్రియమైనది అల్లాహు అక్బర్.

ఆరవ హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో రుజువైనది, సహీహ్ ముస్లిం లోని హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. అల్లాహు తాలా తన దైవదూతల కొరకు మరియు తన యొక్క దాసుల కొరకు ఇష్టపడిన, ఎన్నుకున్న, ఛాయిస్ చేసినటువంటి పదాలలో ఒకటి చాలా ముఖ్యమైనది సుబ్ హా నల్లాహి వబిహమ్దిహీ.

అల్లాహు తాలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక!

నాలుకపై చాలా సులభంగా, త్రాసులో బరువుగా మరియు కరుణామయునికి చాలా ప్రియమైన రెండు వాక్యాలు [ఆడియో]

నాలుకపై చాలా సులభంగా, త్రాసులో బరువుగా మరియు కరుణామయునికి చాలా ప్రియమైన రెండు వాక్యాలు
https://youtu.be/SdPO0cnevo8 [1:17 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[1:17 నిముషాలు]
Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 29
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) తెల్పినటువంటి ” నాలుకపై సులభంగానూ, త్రాసులో బరువుగానూ ఉండే ఆ రెండు వాక్యాలు ఏవి ?

సుబ్ హానల్లాహి వబిహందిహి సుబ్ హానల్లాహిల్ అజీమ్

సహీ బుఖారీలోని చివరి హదీసు, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ తెలిపారుః

كَلِمَتَانِ خَفِيفَتَانِ عَلَى اللِّسَانِ، ثَقِيلَتَانِ فِي المِيزَانِ، حَبِيبَتَانِ إِلَى الرَّحْمٰنِ: سُبْحَانَ الله وَبِحَمْدِهِ ، سُبْحَانَ الله العَظِيمِ

“రెండు పదాలున్నాయి, అవిః నాలుకపై చాలా సులభంగా, త్రాసులో బరువుగా మరియు కరుణామయునికి చాలా ప్రియమైనవి. అవేః సుబ్ హానల్లాహి వబిహందిహీ సుబ్ హానల్లాహిల్ అజీం”. (బుఖారి 6406, ముస్లిం 2694).

అనేక మందికి ఈ రెండు పదాల ఘనత తెలుసు, కాని త్రాసు బరువు కావటానికి చదివేవారు చాలా అరుదు. (మరికొందరికైతే) ఏదైనా కల్చరల్ ప్రోగ్రాముల్లో పోటాపోటీలు, కాంపిటేషన్లు జరుగుతున్నప్పుడు అందులో ఇలాంటి ప్రశ్న ఏదైనా వచ్చినప్పుడు అవి గుర్తుకు వస్తాయి. (ఇది ఎంత దారుణంॽॽॽ).

వఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్

Narrated Abu Huraira radhiyAllahu anhu:

The Prophet (ﷺ) said, “(There are) two words which are dear to the Beneficent (Allah) and very light (easy) for the tongue (to say), but very heavy in weight in the balance. They are: ”Subhan Allah wa-bi hamdihi” and ”Subhan Allah Al-`Azim.”

సుబ్ హానల్లాహ్, సుబ్ హానల్లాహి వబిహందిహీ, సుబ్ హానల్లాహిల్ అదీమ్ ఘనతలు

సుబ్ హానల్లాహ్... పలుకు ఘనతలు
1- అల్లాహ్ మరియు ప్రవక్తకు అతి ప్రియమైన పలుకుల్లో ఒకటి: “సుబ్ హానల్లాహ్”. [ముస్లిం 2137, 2695]
2- ఎవరు వంద సార్లు “సుబ్ హానల్లాహి వబిహందిహ్”  పలుకుతారో, వారి పాపాలు సముద్రపు నురుగంత ఉన్నా మన్నించ బడతాయి. [బుఖారీ 6405, ముస్లిం 2691]
3- ఎవరు ఉదయం మరియు సాయంకాలం “సుబ్ హానల్లాహి వబిహందిహ్” వంద సార్లు పలుకుతారో ప్రళయదినాన అతనికంటే గొప్ప ఆచరణ ఎవరిది ఉండదు, అతని లాగా లేక అతనికంటే ఎక్కువ పలికిన వారిది తప్ప. [ముస్లిం 2692]
4- ఎవరు వంద సార్లు “సుబ్ హానల్లాహ్” పలుకుతారో అతని కొరకు వెయ్యి పుణ్యాలు లిఖించబడతాయి, అతని వెయ్యి పాపాలు మన్నించబడతాయి. [ముస్లిం 2692, సహీహుల్ జామిఅ్ 2665]
5- కరుణామయుడైన (అల్లాహ్ కు) చాలా ఇష్టమైన, నాలుకపై సులభతరమైన మరియు ప్రళయదినాన త్రాసులో చాలా బరువుగల రెండు పలుకులు: “సుబ్ హానల్లాహి వబిహందిహీ సుబ్ హానల్లాహిల్ అజీం”. [బుఖారీ 6406, ముస్లిం 2694]
6- “సుబ్ హానల్లాహిల్ అజీం వబిహందిహ్” పలికినవారి కొరకు స్వర్గంలో ఒక ఖర్జూరపు చెట్టు నాటబడుతుంది. [తిర్మిజి 3464, సహీహా 64]
7-సమావేశ సమాప్తంలో ఈ దుఆ చదివితే, అందులో ఏమైనా వృధా మాటలు జరిగి ఉంటే మన్నించబడును: “సుబ్ హానకల్లాహుమ్మ వబిహందిక అష్ హదు అల్లాఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వఅతూబు ఇలైక్”. [తిర్మిజి 3433, సహీహుల్ జామిఅ్ 6192]
8- విశ్వంలో ప్రతీది “సుబ్ హానల్లాహి వబిహందిహి” అంటుంది, దాని కారణంగానే వారికి ఉపాధి లభిస్తుంది. [అహ్మద్170, సహీహా 134]
9- తహజ్జుద్, అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం మరియు అల్లాహ్ శత్రువులతో పోరాడడం కంటే ఎక్కువ పుణ్యం పొందాలనుకుంటే అధికంగా “సుబ్ హానల్లాహి వబిహందిహి” పఠిస్తూ ఉండండి. [సహీ తర్గీబ్ 1541]

అధికంగా “సుబ్ హానల్లాహి వబిహందిహీ” పఠించడం తహజ్జుద్ పుణ్యానికి సమానం

తహజ్జుద్ కు గల పుణ్యానికి సరిసమాన- మైన ఇతర సత్కార్యాలు/1: అధికంగా సుబ్ హానల్లాహి వబిహందిహీ పఠించడం

తహజ్జుద్ నమాజు యొక్క విలువ అల్లాహ్ వద్ద చాలా గొప్పగా ఉంది. ఫర్జ్ నమాజుల తర్వాత ఎక్కువ శ్రేష్ఠతగల నమాజు తహజ్జుదే. దాని ప్రత్యేకతల్లో: అది కేవలం పాపాలను హరించి వేయడమే గాకుండా; దానిని పాటించేవారిని పాపంలో పడకుండా కాపాడుతుంది. ప్రవక్త ﷺ ఇలా తెలిపారని అబూ ఉమామా బాహిలీ  ఉల్లేఖించారుః 

عَلَيْكُمْ بِقِيَامِ اللَّيْلِ فَإِنَّهُ دَأَبُ الصَّالِحِينَ قَبْلَكُمْ، وَهُوَ قُرْبَةٌ إِلَى رَبِّكُمْ، وَمَكْفَرَةٌ لِلسَّيِّئَاتِ، وَمَنْهَاةٌ لِلإِثْمِ

“మీరు తహజ్జుద్ నమాజు చేయండి, అది మీకంటే ముందు పుణ్యాత్ముల సద్గుణం, మీ ప్రభువు సాన్నిధ్యానికి చేర్చునది, పాపాలకు పరిహారం మరియు అపరాధాల నుండి వారిస్తుంది”. 

(తిర్మిజి 3549, ఇబ్ను ఖుజైమా 1135, సహీహుత్తర్గీబ్ 624లో హసన్ లిగైరిహి అని ఉంది).


పూర్వ పుణ్యపురుషులు రహిమహుముల్లాహ్ యే కాదు, గత సమీప కాలాల్లో మన తాతముత్తాతలు తహజ్జుద్ నమాజులో ఏ కొరతా చూపేవారుకాదు. కాని ఈ కాలంలో అనేక మంది రాత్రులు పగల్లో, నిద్రలు జాగారాల్లో మారిపోయి, రాత్రి వేళల్లో అల్లాహ్ ను వేడుకునే మాధుర్యాన్ని కోల్పోయారు. మరికొందరు ఎంతటి అలసత్వానికి గురి అయ్యారంటే ఫజ్ర్ నమాజు సైతం వదిలేస్తున్నారు. 

తన దాసులపై ఉన్న అల్లాహ్ యొక్క గొప్ప కరుణ ఏమిటంటే; ఆయన వారికి చిన్నపాటి కొన్ని కార్యాలు ప్రసాదించాడు, వాటి పుణ్యఫలితం తహజ్జుద్ కు సమానంగా ఉంది. ఎవరికైనా తహజ్జుద్ తప్పిపోతే లేదా ఎవరైనా తహజ్జుద్ చేయలేక పోతే కనీసం ఇలాంటి సత్కార్యాలు తప్పిపోకూడదు, వాటి ద్వారా తన త్రాసు బరువును పెంచుకోవచ్చును. ఇది తహజ్జుద్ చేయలేకపోయినా పరవా లేదు అన్న మాట కాదు, మన పూర్వ పుణ్యపురుషులు ఎన్నడూ అలా భావించలేదు, వారైతే ప్రతి పుణ్య కార్యంలో ముందంజవేసి, చురుకుగా పాల్గొనేవారు. 


ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరులకు కొన్ని సులువైన ఆచరణల గురించి తెలిపారు, ప్రత్యేకంగా ఎవరైతే తమకు తాము కొంత శ్రమ పడి తహజ్జుద్ చేయలేకపోతారో అలాంటి వారి గురించి, ఇలా మనల్ని కూడా సత్కార్యాలు చేసుకొని మన పుణ్యాలను పెంచుకోవాలని ప్రోత్సహించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని అబూ ఉమామా బాహిలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః 

مَنْ هَالَهُ اللَّيْلُ أَنْ يُكَابِدَهُ، وَبَخِلَ بِالْمَالِ أَنْ يُنْفِقَهُ، وَجَبُنَ عَنِ الْعَدُوِّ أَنْ يُقَاتِلَهُ، 
فَلْيُكْثِرْ أَنْ يَقُولَ: سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ، فَإِنَّهَا أَحَبُّ إِلَى اللهِ مِنْ جَبَلِ ذَهَبٍ وَفِضَّةٍ يُنْفَقَانِ فِي سَبِيلِ اللهِ عَزَّ وَجَلَّ

“ఎవరు రాత్రి వేళ మేల్కొని (తహజ్జుద్ కై) శ్రమ పడుటకు భయపడ్డాడో, ధనాన్ని (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేయుట నుండి పిసినారితనం వహించాడో మరియు శతృవుతో పోరాడడానికి పిరికితనం వహించాడో అతను అధికంగా సుబ్ హానల్లాహి వబిహందిహీ అనాలి. ఈ పదాలు అల్లాహ్ కు ఆయన మార్గంలో ఖర్చుపెట్టబడ్డ వెండి, బంగారాల కంటే ఎక్కువగా ఇష్టమైనవి, ప్రియమైనవి”. 

(తబ్రానీ కబీర్ 7795, అల్బానీ సహీహుత్తర్గీబ్ 1541లో సహీ లిగైరిహీ అని అన్నారు).