https://youtu.be/XmqfEbXQ1Qg [6 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ చిన్న వీడియో క్లిప్ క్రింది వీడియో నుండి తీసుకోబడింది :
నాలుగు శుభవచనాల ఘనతలు (సుబ్ హా నల్లాహ్ , అల్ హమ్ దు లిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్) – https://youtu.be/2YarbpvfFK0
ఈ ప్రసంగంలో, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించిన ఐదు అత్యంత బరువైన పుణ్యకార్యాల గురించి వివరించబడింది. ప్రళయదినాన కర్మల త్రాసులో అత్యధిక బరువును కలిగి ఉండే ఈ ఐదు విషయాలలో నాలుగు ముఖ్యమైన జిక్ర్ (దైవ స్మరణ) వచనాలు ఉన్నాయి: ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’, ‘సుబ్ హా నల్లాహ్’, ‘అల్హందులిల్లాహ్’, మరియు ‘అల్లాహు అక్బర్’. ఐదవది, ఒక ముస్లిం తన పుణ్యాత్ముడైన సంతానం మరణించినప్పుడు, అల్లాహ్ నుండి ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఓపిక సహనాలను ప్రదర్శించడం. ఈ పనులు మరియు మాటలు త్రాసులో చాలా బరువైనవి అని నొక్కిచెబుతూ, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో వీటిని నిరంతరం ఆచరించాలని ప్రసంగం ప్రోత్సహిస్తుంది.
పుణ్యాల త్రాసులో బరువైన ఐదు విషయాలు
మరో రకమైన సత్కార్యం గురించి నేను షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహ్ ఉత్తర్గీబ్ లో ప్రస్తావించిన హదీసును మీ ముందు పెట్టి దాన్ని సంక్షిప్తంగా వివరిస్తాను, శ్రద్ధగా వినండి. మరియు అలాగే ఆ హదీస్ మీలో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కూడా నేర్చుకోవచ్చు. అందుకొరకే దీనిని నేను మీకు చూపిస్తున్నాను.
ఇక్కడ ఈ హదీస్ వినిపించే కంటే ముందు ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. పైన మీరు చూస్తున్నారు.
وَعَنْ أَبِي سَلْمَى رَاعِي رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ : سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మేకల కాపరి అయిన అబూ సలమా ఉల్లేఖిస్తున్నారు ఈ హదీసుని.
అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది మీకు? ఆనాటి కాలంలో ఉన్నటువంటి బానిసలు గాని, కాపరి లాంటి వారు గాని ప్రవక్త ద్వారా ధర్మ విద్య నేర్చుకునే విషయంలో కూడా ఎంత ముందుగా ఉండేవారు. మరియు ఆయన ఏమంటున్నారు, “సమితు,” నేను ప్రవక్తతో విన్నాను. ఎక్కడో ఎవరో ఎవరితో విన్న విషయం కాదు, స్వయంగా ప్రవక్తతో విని ఆయన ఉల్లేఖిస్తున్నారు.
అయితే మనం ఈ రోజుల్లో అయ్యా రండి కొంచెం ధర్మం నేర్చుకుందాము, ఈరోజు ఖురాన్ దర్స్ నడుస్తుంది వచ్చేసేయండి, ఇగో హదీస్ చెబుతున్నారు ఈరోజు అంటే, అయ్యో అది మీలాంటి చదువరులకయ్యా, మాకు, మాలాంటి పామరులకు, మాలాంటి విద్య లేని వారికి ఇవన్నీ ఏం ఎక్కడ మా బుర్రలో దిగవు అని అంటారు కదా కొందరు? తప్పు మాట. ధర్మ విషయం నేర్చుకోవడానికి, కనీసం వినడానికి వెనక ఉండకూడదు.
అయితే ఈ హదీసులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటి గమనించండి. ఈ నాలుగు పదాల ప్రస్తావన ఉంది ఇందులో. కానీ దాని గురించి ఏమంటున్నారు?
بَخٍ بَخٍ لِخَمْسٍ مَا أَثْقَلَهُنَّ فِي الْمِيزَانِ
బఖిన్ బఖిన్ లిఖమ్సిన్, మా అస్ఖలహున్న ఫిల్ మీజాన్
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, “బఖిన్ బఖిన్ (ఎంత మంచివి, ఎంత గొప్పవి) ఐదు విషయాలు, ఎంత మంచివి, చాలా మంచివి. పుణ్యాల త్రాసులో అవి చాలా బరువు గలవి.”
గమనిస్తున్నారా? ప్రళయ దినాన ఏం జరుగుతుంది? సూరతుల్ ముఅ’మినూన్, సూరతుల్ ఆరాఫ్, అలాగే ఇదా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా, ఇవన్నీ సూరాలలో ఏం తెలుస్తుంది మనకు? అలాగే సూరతుల్ అంబియా ఆయత్ నెంబర్ 47 లో కూడా చూడొచ్చు మీరు. అల్లాహ్ తఆలా ప్రళయ దినాన త్రాసును నెలకొల్పుతాడు. పుణ్యాలను అందులో తూకం చేయడం జరుగుతుంది, పాపాలను తూకం చేయడం జరుగుతుంది. పుణ్యాలు బరువుగా ఉన్నప్పుడే మనం స్వర్గంలోకి వెళ్తాము. ఆ రోజు త్రాసును నెలకొలపడం ప్రజల యొక్క ఆచరణలను, వారి యొక్క కర్మ పత్రాలను, చివరికి స్వయం వారినే కూడా తూకం చేయడం జరుగుతుంది. ఎవరి త్రాసు పల్లెం బరువుగా ఉంటుందో అలాంటి వారే సాఫల్యం పొందుతారు.
అయితే ఇక్కడ ఏమంటున్నారు ప్రవక్త ఈ హదీసులో, مَا أَثْقَلَهُنَّ فِي الْمِيزَانِ “మా అస్ఖలహున్న ఫిల్ మీజాన్” (త్రాసులో అవి ఎంత బరువైనవి!). ఈ ఐదు విషయాలు చాలా మంచివి, చాలా మంచివి, ఇవి త్రాసులో, పుణ్యాల త్రాసులో చాలా చాలా బరువుగా ఉంటాయి.
ఏంటండీ అవి?
لَا إِلَهَ إِلَّا اللَّهُ، وَسُبْحَانَ اللَّهِ، وَالْحَمْدُ لِلَّهِ، وَاللَّهُ أَكْبَرُ
లా ఇలాహ ఇల్లల్లాహ్, వ సుబ్ హా నల్లాహ్, వల్ హందులిల్లాహ్, వల్లాహు అక్బర్
అల్లాహ్ తప్ప ఆరాధ్యుడు లేడు, అల్లాహ్ పవిత్రుడు, సర్వ స్తోత్రాలు అల్లాహ్ కే, మరియు అల్లాహ్ గొప్పవాడు.
ఈ నాలుగు పదాలు. మరొక ఆచరణ గురించి చెప్పడం జరిగింది. అదేంటి?
وَالْوَلَدُ الصَّالِحُ يُتَوَفَّى لِلْمَرْءِ الْمُسْلِمِ فَيَحْتَسِبُهُ
వల్ వలదుస్ సాలిహు యుతవఫ్ఫా లిల్ మర్ఇల్ ముస్లిం ఫయహ్తసిబుహు
ఒక ముస్లిం వ్యక్తి యొక్క పుణ్యాత్ముడైన సంతానం మరణించినప్పుడు, అతను (తల్లి/తండ్రి) అల్లాహ్ నుండి ప్రతిఫలాన్ని ఆశిస్తూ సహనంతో భరిస్తాడు.
ఒక పుణ్యాత్ముడైన, ఒక ముస్లిం వ్యక్తి యొక్క పుణ్యాత్ముడైన సంతానం… అల్లాహు అక్బర్. ఇక్కడ గమనించండి, వల్ వలదుస్ సాలిహ్ – మంచి సంతానం, యుతవఫ్ఫా – చనిపోతాడు, లిల్ మర్ఇల్ ముస్లిం – ఒక ముస్లిం వ్యక్తి యొక్క మంచి సంతానం. అయితే ఆ ముస్లిం వ్యక్తి ఏం చేస్తాడు? ఫయహ్తసిబుహు – అతను అల్లాహ్ తో పుణ్యాన్ని ఆశించి ఓపిక సహనాలు వహిస్తాడు.
అయ్యయ్యో ఏంటి దేవుడా నాకు ఒకే ఒక కొడుకు ఉండే నువ్వు తీసుకుంటివా? ఇలాంటి షిక్వా షికాయత్ (ఫిర్యాదు), ఇలాంటి తప్పుడు మాటలు తన నోటితో రానివ్వడు. ఇలా ఓపిక సహనాలతో అల్లాహ్ తో పుణ్యాన్ని ఆశిస్తూ ఉండే వ్యక్తి యొక్క ఈ ఆచరణ కూడా పుణ్యాల త్రాసులో చాలా బరువుగా ఉంటుంది.
మన అంశానికి మనం మళ్ళీ తిరిగి వచ్చేద్దాం. లా ఇలాహ ఇల్లల్లాహ్, సుభానల్లాహ్, వల్ హందులిల్లాహ్, వల్లాహు అక్బర్ – ఈ నాలుగు శుభవచనాలు ఎంత గొప్ప ఘనత గలవి అంటే ప్రళయ దినాన త్రాసులో వీటి బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. అందు గురించి మీరు లెక్కలేకుండా మీ యొక్క పనిలో మీరు నిమగ్నులవుతూ కూడా మీ నాలుకను అల్లాహ్ యొక్క ఇలాంటి ధిక్రులో నిమగ్నులై ఉండే విధంగా ప్రయత్నిస్తూ ఉండండి.