
బలం, శక్తి లేక సామర్ధ్యం – ఇవన్నీ కేవలం అల్లాహ్ ద్వారా మాత్రమే లభిస్తాయి. మనిషి ఎంత పెద్ద శక్తిమంతుడైనా, ఎంతటి బలం బలగం, అందలం అధికారం కలవాడైనా అల్లాహ్ ముందు అతను ఒక బలహీనమైన ప్రాణి మాత్రమే. చిటికేసి యావత్ ప్రపంచ యంత్రాంగాన్ని నడిపించగల తోపు అయినా సరే అల్లాహ్ సహాయం, అల్లాహ్ సంకల్పం లేకుండా ఏమీ చేయలేడు. ఆఖరికి మనిషి మంచి పనులు చేయాలన్నా, చెడు పనుల నుంచి ఆగిపోవాలన్నా అల్లాహ్ బలమే కావాలి. అల్లాహ్ ప్రసాదించే శక్తిసామర్ధ్యాలే అతనిలో ఉండాలి.
జీవితంలో అడుగడుగునా మనకు అల్లాహ్ సహాయం కావాలి. అలాంటప్పుడు మనల్ని సృష్టించిన ఆ ఏకైక సృష్టికర్త అల్లాహ్ యొక్క సహాయం అడుక్కోవటానికి నామోషీ ఎందుకు?
అసలు ఆలోచిస్తే మనం అల్లాహ్ ను అంతకంటే ఎక్కువగా ప్రార్థించాలి. మన కష్టాల్ని ఆయనకు విన్నవించుకోవాలి. బాధలను తొలగించమని వేడుకోవాలి. కోరికలు తీర్చమని పదే పదే ప్రాధేయపడాలి. అది డబ్బు సమస్య అయినా, కుటుంబ సమస్యలు అయినా, మరేదైనా సరే. ఆ గడ్డు పరిస్థితిని దాటటానికి దివ్యమైన శక్తి కావాలి. అటు వంటి దివ్యమైన శక్తి లభించే ఏకైక ఆధారం అల్లాహ్!
జీవితంలో తట్టుకోలేని పెను ప్రమాదాలు ఎదురైనప్పుడు మనిషి నోటి నుండి వెలువడే – “అల్లాహ్ సహాయం లేకుండా మనం ఏమీ చేయలేము” – వంటి మాటలు అల్లాహ్ కు ఎంతో ప్రియమైనవి. అటువంటి వారికి అల్లాహ్ సహాయం తప్పకుండా లభిస్తుంది.
అబూ మూసా అష్ అరీ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: ఒకసారి దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో, “స్వర్గలోకపు నిధులలో నుంచి ఒక నిధిని గురించి నేను మీకు తెలుపనా?” అని అడిగారు. “తెలుపండి దైవప్రవక్తా!” అన్నాను నేను. దానికి ఆయన ఇలా పలకమని చెప్పారు:
لَا حَوٍلَ وَلَا قُوَّةَ إِلَّا باللهِ
“లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్”
ఏ శక్తి అయినా, ఏ సామర్థ్యం అయినా అల్లాహ్ ద్వారా మాత్రమే లభిస్తుంది.
(బుఖారీ, మస్లిం గ్రంథాలు)
—
ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:
మహిమ గల 12 దుఆలు – శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్ [PDF] [పాకెట్ సైజు ]
పై లింక్ నొక్కి పూర్తి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి
క్రింది వీడియో తప్పక వినండి
స్వర్గపు నిధులలో ఒక గొప్ప నిధి – లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్
https://youtu.be/h-81z8V7ecU [68 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)