హస్బునల్లాహు వ నీమల్ వకీల్ – حَسْبُنَا اللَّهُ وَنِعْمَ الْوَكِيلُ

వాస్తవంలో మనలను కాపాడేదెవరు? అల్లాహ్ యే కదా! ఆయన మన వెంట ఉంటే ఇక ప్రపంచంలో ఏ శక్తి మనల్ని ఏమీ చేయజాలదు. అల్లాహ్ మనతో ఉన్నాడన్న విశ్వాసం జీవితంలో మనల్ని ఏ సందర్భంలోనూ నిరాశా నిస్పృహలకు లోను కానివ్వదు. ఇతరుల దగ్గర మందీ మార్బలం ఉండవచ్చు. అందలం అధికారం ఉండవచ్చు. మారణాయుధాలు ఉండవచ్చు. అయితే వాటన్నిటి కంటే బలమైనది ఖుర్ఆన్ విశ్వాసులకు బోధిస్తున్న ఈ ప్రకటన వాక్యం:

حَسْبُنَا اللَّهُ وَنِعْمَ الْوَكِيلُ
“హస్బునల్లాహు వ నీమల్ వకీల్”
మాకు అల్లాహ్ చాలు. ఆయన ఎంతో మంచి కార్యసాధకుడు (పనులు చక్కబెట్టేవాడు)
(ఖుర్ఆన్ 3:173)

మండే అగ్ని గుండం ఒక్కసారిగా చల్లారిపోవటాన్ని మీరు ఊహించగలరా! నిరంకుశ రాజు నమ్రూద్, అతని జాతివారు – ఏకదైవారాధనా నేరానికి – ఇబ్రాహీమ్ ప్రవక్తపై సజీవ దహన శిక్షను అమలు పరచాలని నిర్ణయిం చారు. భగభగ మండే అగ్ని గుండంలోకి ఆయనను విసిరేశారు. ఆ సమయంలో యువకుడైన ఇబ్రాహీమ్ ఏమాత్రం బెదర లేదు. భయపడలేదు. ఒకే ఒక్క అల్లాహ్ ఆరాధనపై ఆయనకు నమ్మకం మరింత బలపడింది. అల్లాహ్ పై అంతులేని విశ్వాసంతో ఆయన, “హస్బునల్లాహు వ నీమల్ వకీల్” అన్నారు. మండుతున్న అగ్ని గుండం ఒక్కసారిగా చల్లారిపోయింది.

“మక్కావారు ఒక పెద్ద సైన్యంతో మీపైకి దండెత్తి వస్తు న్నారు” అని ఒకసారి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)తో అన్నప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయన వెంట ఆయన సహచరులు బిగ్గరగా ఇలా ప్రకటించారు: “హస్బునల్లాహు వ నీమల్ వకీల్”

الَّذِينَ قَالَ لَهُمُ النَّاسُ إِنَّ النَّاسَ قَدْ جَمَعُوا لَكُمْ فَاخْشَوْهُمْ فَزَادَهُمْ إِيمَانًا وَقَالُوا حَسْبُنَا اللَّهُ وَنِعْمَ الْوَكِيلُ

”అవిశ్వాస జనులు మీకు వ్యతిరేకంగా భారీ సైన్యాన్ని మోహరించి ఉన్నారు. మీరు వారికి భయపడండి” అని ప్రజలు వారితో అన్నప్పుడు, ఆ మాట వారి విశ్వాసాన్ని మరింతగా పెంచింది. దానికి జవాబుగా, ”మాకు అల్లాహ్‌ చాలు. ఆయన చాలా మంచి కార్యసాధకుడు” అని వారన్నారు. (సూరా ఆలి ఇమ్రాన్ 3:173)

ఖుర్ఆన్ ద్వారా లభించిన ఈ చిట్కా జీవితంలో ఎటువంటి ఆపదలు, ప్రమాదాలనైనా ఎదుర్కొవటానికి తోడ్పడుతుంది. అయితే అందుకు అల్లాహ్ మీద పూర్తి నమ్మకం ఉండాలి. మిగతా విషయాలన్ని అల్లాహ్ కు వదిలేయాలి. కేవలం అల్లాహ్ సహాయాన్ని, కరుణను మాత్రమే కోరుకోవాలి. అల్లాహ్ రాసిపెట్టిన విధివ్రాత ముందు తలవంచాలి. అల్లాహ్ కు ఆత్మసమర్పణ చేసుకొని జీవితాన్ని కొనసాగిం చాలి.

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:
మహిమ గల 12 దుఆలు – శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్ [PDF] [పాకెట్ సైజు ]
పై లింక్ నొక్కి పూర్తి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి




Leave a comment