🕋 జిల్ హిజ్జ తొలి దశలోని ఘనమైన ఆచరణల్లో ఒకటైన అల్లాహ్ స్మరణల్లో ముఖ్యమైన జిక్ర్ 🕋
https://youtu.be/2YarbpvfFK0 [55 నిముషాలు]
ఈ ప్రసంగంలో, ఇస్లాంలో జిల్ హిజ్జా మాసంలోని మొదటి పది రోజుల ప్రాముఖ్యత మరియు గొప్పతనం గురించి వివరించబడింది. ఈ పవిత్రమైన రోజుల్లో అల్లాహ్‌ను స్మరించడం (జిక్ర్) యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ముఖ్యంగా, ‘సుబ్ హానల్లాహ్’, ‘అల్ హందులిల్లాహ్’, ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’, మరియు ‘అల్లాహు అక్బర్’ వంటి శుభ వచనాల యొక్క ఘనత, వాటిని పఠించడం వల్ల కలిగే పుణ్యాలు మరియు స్వర్గంలో లభించే ప్రతిఫలాల గురించి హదీసుల ఆధారంగా వివరించబడింది. ఈ స్మరణ నరకం నుండి రక్షణగా మరియు ప్రళయ దినాన పుణ్యాల త్రాసులో బరువుగా ఎలా నిలుస్తుందో తెలియజేశారు.
అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబీయ్యినా ముహమ్మద్ వఅలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్.
ప్రియ వీక్షకులారా! ఇప్పుడు మనం ఏ శుభ రోజుల్లో ఉన్నామో, వాస్తవానికి మనలో అనేకమంది, ఒకవేళ 99% అని అంటే కూడా ఈ మాట తప్పు కాదు కావచ్చు. ఈ శుభప్రదమైన ఎక్కువ ఘనత గల రోజులు, వీటి యొక్క విలువను తెలుసుకోకుండా, ఇందులో అల్లాహ్‌కు ఇష్టమైన రీతిలో సత్కార్యాలు చేసుకోకుండా గడుపుతున్నారు.
అయితే, మనం ఎంత ఎక్కువగా ధర్మజ్ఞానం నేర్చుకుంటూ, ఇలాంటి రోజుల గురించి తెలుసుకుంటూ, ఇందులో అల్లాహ్‌కు ఇష్టమైన కార్యాలు మనం చేస్తూ ఉంటామో, మనకంటే ఎక్కువ అదృష్టవంతులు మరెవరూ ఉండరు.
శుభప్రదమైన రోజుల ప్రాముఖ్యత
ఈ శుభప్రదమైన, ఘనత గల రోజుల్లో మనం చేయవలసిన ఎన్నో రకాల సత్కార్యాలలో ఒక గొప్ప సత్కార్యం అల్లాహ్ యొక్క స్మరణ. అల్లాహ్ యొక్క జిక్ర్. వాస్తవానికి ఇది మనకు మూడు పూటల భోజనాని కంటే ఎక్కువ విలువ గలది, ముఖ్యమైనది. ఎలాగైతే పొద్దంతా ఓ గుక్కెడు నీళ్ళు మరియు ఓ నాలుగు మెతుకులు మనకు దొరకకుంటే మన జీవితం అంతమైపోతుందని భావిస్తామో, ఒక రోజు గడిచినది, మనం అల్లాహ్‌ను స్మరించలేదు అంటే అంతకంటే ఎక్కువ నష్టం మనకు వాటిల్లినట్లు. కానీ మనలో అనేక మంది చాలా అశ్రద్ధగా ఉన్నారు ఈ విషయం నుండి.
ఈ రోజుల్లో అనేక మందిని మనం చూస్తూ ఉన్నాము. వారి వారి పనుల్లో, జాబ్ లో, వారి యొక్క వ్యవసాయ పనులు గాని, వారి యొక్క ఆటపాటల్లో ఎంతో నిమగ్నులై ఉన్నారు. కానీ ఈ రోజులు ఎలాంటివి, ఇందులో అల్లాహ్ యొక్క స్మరణ ఎంత గొప్పగా మనం చేయాలి అన్న విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. అందుకొరకే ఇలాంటి ఈ మరుపులో, అశ్రద్ధలో ఉన్న సందర్భాల్లో వారికి జాగృతం చేయడం, వారిని మేల్కొల్పడం ఇది కూడా ఒక చాలా గొప్ప సత్కార్యం.
అల్లాహ్ యొక్క స్మరణ (జిక్ర్)
అయితే, అల్లాహ్ యొక్క జిక్ర్ ఎన్నో రకాలుగా చేయబడుతుంది. మరియు అల్లాహ్‌ను మనం స్మరించడానికి స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో పదాలు మనకు తెలిపారు. కానీ వాటన్నిటినీ చెప్పుకుంటూ పోతే సమయం మనకు సరిపోదు. ఇక్కడ ముందు మీరు ఇప్పుడు చూస్తున్నట్లు స్క్రీన్ పై:
سبحان الله
సుబ్ హానల్లాహ్
(అల్లాహ్ పవిత్రుడు)
والحمد لله
వల్ హందులిల్లాహ్
(మరియు ప్రశంసలన్నీ అల్లాహ్ కే)
ولا إله إلا الله
వ లా ఇలాహ ఇల్లల్లాహు
(మరియు అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు)
والله أكبر
వల్లాహు అక్బర్
(మరియు అల్లాహ్ గొప్పవాడు)
ఈ నాలుగు పదాల శుభ వచనాల ఘనతలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే రండి, ముందు నేను మీకు ముస్నద్ అహ్మద్ లోని ఒక హదీస్ వినిపిస్తాను. ఈ హదీస్ ద్వారా మనకు ఇప్పుడు మనం ఉన్నటువంటి రోజుల ఘనతతో పాటు ఈ జిక్ర్ లో నాలుగు వచనాలలో మూడిటి ప్రస్తావన ఇందులో వస్తుంది. ముస్నద్ అహ్మద్ లోని హదీస్, హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
ما من أيام أعظم عند الله
మా మిన్ అయ్యామిన్ అ’జము ఇందల్లాహ్
(అల్లాహ్ వద్ద అత్యంత గొప్ప రోజులు ఏవీ లేవు)
ولا أحب إليه
వలా అహబ్బు ఇలైహి
(మరియు ఆయనకు అత్యంత ప్రియమైనవి)
من العمل فيهن من هذه الأيام العشر
మినల్ అమలి ఫీహిన్న మిన్ హాదిహిల్ అయ్యామిల్ అషర్
(ఈ పది రోజులలో చేసే ఆచరణల కంటే)
ఈ పది రోజుల కంటే వేరే ఏ రోజులు లేవు. అర్థమైందా? జిల్ హిజ్జా తొలి దశలో ఈ తొలి దశ ఇందులో ఉన్నటువంటి రోజులు అల్లాహ్ వద్ద చాలా గొప్ప దినాలు, గొప్ప రోజులు. సంవత్సరంలోని 355 రోజుల కంటే ఎక్కువ ఘనత గల గొప్ప రోజులు ఇవి. అంతేకాదు,
ولا أحب إليه من العمل فيهن
వలా అహబ్బు ఇలైహి మినల్ అమలి ఫీహిన్
(మరియు ఆ రోజులలో చేసే ఆచరణ కంటే ఆయనకు ప్రియమైనది ఏదీ లేదు)
మరియు వేరే రోజుల్లో మనం ఎన్ని సత్కార్యాలు చేస్తామో వాటన్నింటి కంటే ఎక్కువ ప్రియమైనవి ఈ పది రోజుల్లో, ఈ తొలి దశలో మనం చేసే అటువంటి సత్కార్యాలు అల్లాహ్‌కు ఎక్కువగా ప్రీతికరమైనవి. చూడండి ఇక్కడ మీరు గమనించండి. ఆ తర్వాత ఏమంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం? అన్ని రకాల సత్కార్యాలు అల్లాహ్‌కు ఇందులో చాలా ప్రియమైనవి. కానీ ఏ ఆచరణ మనం ఎక్కువగా చేయాలని అంటున్నారు? వినండి.
فأكثروا
ఫ అక్థిరూ
(మీరు అధికంగా చేయండి)
فيهن
ఫీహిన్న
(వాటిలో)
ప్రత్యేకంగా ఈ పది రోజుల్లో, ఈ జిల్ హిజ్జా తొలి దశలో ఏం చేయాలి?
من التهليل والتكبير والتحميد
మినత్తహ్లీలి వత్తక్బీరి వత్తహ్మీద్
(తహ్లీల్, తక్బీర్ మరియు తహ్మీద్ చేయండి)
తహ్లీల్ అంటే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అని పలకడం. వ తక్బీర్ అంటే ‘అల్లాహు అక్బర్’ అని పలకడం. వ తహ్మీద్ అంటే ‘అల్ హందులిల్లాహ్’ అని పలకడం. అర్థమైంది కదా? అందుకొరకే మనం దీనిని ఎంతో అదృష్టంగా భావించి, అధికంగా, అధికంగా అల్లాహ్ యొక్క స్మరణ చేస్తూ ఉండాలి.
నేను ఇంతకు ముందు ఎన్నో సందర్భాల్లో చెబుతూ ఉంటాను. అల్లాహ్ మన కొరకు ఏ ఇస్లాం ధర్మాన్ని మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ప్రసాదించి చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దీనిని అంతం చేశాడో, ఇందులో ఈ సత్య ధర్మంలో పెద్ద పెద్ద చదువులు, డిగ్రీలు చదివిన వారి కొరకు, ఏ మాత్రం విద్యా లేకుండా అక్షర జ్ఞానం లేకుండా సామాన్య జీవితం బ్రతుకుతున్న వారికి, అందరికీ అర్థమయ్యే అటువంటి విషయాలు ఉన్నాయి. అందుకొరకే సర్వసామాన్య ప్రజలకు అర్థమయ్యేలాంటి ఉదాహరణల ద్వారా కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం యొక్క బోధనలు, ఇందులో ఉన్నటువంటి సత్కార్యాల గురించి ఉపమానాలు, ఉదాహరణలు ఇచ్చి చెబుతూ ఉండేవారు.
పుణ్యాల త్రాసును బరువు చేసే శుభ వచనాలు
ఇప్పుడు మీరు ఒక హదీస్ విన్నారు. ఈ రోజుల్లో ఎక్కువ ఘనత ఏ పదాలకు ఉన్నాయి, మనం ఏ పదాలు, ఏ పలుకులు ఎక్కువగా పలుకుతూ ఉండాలి అన్నది. ఇక రండి, ఈ పలుకుల గురించి మరొక హదీస్ మనం చూద్దాము. ఇందులో ఎంత గొప్ప శుభవార్త ఉందో.
షేఖ్ అల్బానీ (రహమహుల్లాహ్) సహీహ్‌లో ప్రస్తావించారు. హదీస్ నెంబర్ 1549, సహీహుత్తర్గీబ్ లోనిది. మరియు ఇబ్నె మాజాలో వచ్చిన హదీస్ ఇది, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం,
مر به وهو يغرس غرسا
మర్ర బిహి వహువ యగ్రిసు గర్సన్
(ఆయన దగ్గర నుండి వెళ్ళారు, ఆయన ఒక మొక్కను నాటుతుండగా)
అబూ హురైరా ఒక వృక్షం నాటుతున్నారు, ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అటు నుంచి దాటారు. దాటుతూ ఏమడిగారు?
يا أبا هريرة ما الذي تغرس
యా అబా హురైరా మల్లదీ తగ్రిస్
(ఓ అబూ హురైరా, నీవు ఏమి నాటుతున్నావు?)
ఓ అబూ హురైరా, నీవు ఏమి నాటుతున్నావు? ఏ వృక్షం పెడుతున్నావు భూమిలో? అబూ హురైరా (రదియల్లాహు అన్హు) అంటున్నారు, నేను చెప్పాను, ఒక ఖర్జూరపు మొక్క ఒక చిన్న పిల్ల దాన్ని నేను భూమిలో నాటుతున్నాను అని.
అయితే చూడండి, ప్రపంచ అభివృద్ధి, ప్రపంచంలో మన తోటలు, మన వ్యవసాయం, మనకు నాలుగు డబ్బులు వచ్చే అటువంటి ఏదైనా మార్గం, ఉపాధి, ఏదైనా ఉద్యోగం, ఏదైనా కొలిమి, దాని పట్ల శ్రద్ధ ఉండి మనం అందులో మన సమయాన్ని, మన యొక్క ఆలోచనలను ఎలా ఖర్చు పెడుతున్నామో, ఇలాంటి ఆలోచనలను ప్రవక్త వారు ఎంత మంచిగా, సునాయాసంగా పరలోకం వైపునకు మారుస్తూ ఉండేవారో గమనించండి.
అబూ హురైరా మాట విని ప్రవక్త చెప్పారు,
ألا أدلك على غراس خير من هذا
అలా అదుల్లుక అలా గిరాసిన్ ఖైరిమ్ మిన్ హాదా
(దీనికంటే ఉత్తమమైన ఒక వృక్షం గురించి నేను నీకు తెలుపనా?)
ఓ అబూ హురైరా, ఈ వృక్షం నువ్వు ఏదైతే నాటుతున్నావో, ఇంతకంటే ఉత్తమమైన ఒక వృక్షం, ఇంతకంటే ఒక మేలైన నీ కొరకు ఒక వృక్షం గురించి నేను తెలపాలా? అదేమిటంటే
سبحان الله، والحمد لله، ولا إله إلا الله، والله أكبر
సుబ్ హానల్లాహ్, వల్ హందులిల్లాహ్, వలా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్
(అల్లాహ్ పవిత్రుడు, మరియు ప్రశంసలన్నీ అల్లాహ్ కే, మరియు అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, మరియు అల్లాహ్ గొప్పవాడు)
ఈ నాలుగు పదాలు నీవు పలుకుతూ ఉండు.
تغرس لك بكل واحدة شجرة في الجنة
తుగ్రిస్ లక బికుల్లి వాహిదతిన్ షజరతున్ ఫిల్ జన్నహ్
(దానిలో ప్రతి ఒక్క దానికి బదులుగా స్వర్గంలో నీకు ఒక వృక్షం నాటబడుతుంది)
దీనిలోని ప్రతి ఒక్క దానికి బదులుగా నీకు స్వర్గంలో ఒక వృక్షం నాటడం జరుగుతుంది. అల్లాహు అక్బర్! గమనించారా? మనం ఎంత ఎక్కువగా ‘సుబ్ హానల్లాహ్ వల్ హందులిల్లాహ్ వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్’ అంటామో, ప్రతి ఒక్క వచనం, సుబ్ హానల్లాహ్ ఒక్కసారి పలుకుతే ఒక వృక్షం, అల్ హందులిల్లాహ్ ఒక్కసారి పలుకుతే ఒక వృక్షం, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఒక్కసారి పలుకుతే ఒక వృక్షం, అల్లాహు అక్బర్ ఒక్కసారి పలుకితే ఒక వృక్షం. ఈ విధంగా మన కొరకు స్వర్గంలో నాటబడుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చారు.
సోదర మహాశయులారా! ఒకసారి గమనించండి. వర్షాలు అధికంగా వచ్చి పంట పాడవుతే ఎంత బాధ కలుగుతుంది? వర్షాలు రాకుండా, నీటి చుక్క లేకుండా భూమి బీడుగా మారి ఏ మనం వ్యవసాయం చేయకుండా ఉంటే కూడా ఎంత బాధ కలుగుతుంది? ఈ బాధలో ఎందరో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నది మనం చూస్తున్నాము కదా?
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాంటి ఈ తోట, వ్యవసాయం, పంట, పనుల్లో ఉన్న ఒక వ్యక్తిని చూసి, ‘సుబ్ హానల్లాహ్, వల్ హందులిల్లాహ్, వలా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్’ గురించి ఎంత మంచి ఉదాహరణ ఇస్తూ ప్రతి ఒక్క పదానికి బదులుగా ప్రళయ దినాన ఒక మంచి వృక్షం అనేది అతనికి లభిస్తుంది అని శుభవార్త వినిపించారో గమనించండి. దీని ద్వారా మనకు ఏం తెలుస్తుంది? ఈ లోకంలో ఉండి మనం ఒకవేళ ఈ పని చేసుకోకుంటే స్వర్గంలో ఉన్నటువంటి ఈ గొప్ప అవకాశాన్ని కోల్పోయే అటువంటి ప్రమాదం ఉందా లేదా? మరి స్వర్గాన్ని కోల్పోయే ప్రమాదం మనం కొని తెచ్చుకుంటే మనకు ఏమైనా లాభం ఉంటుందా? అందుకొరకు అల్లాహ్ యొక్క జిక్ర్ అధికంగా చేస్తూ ఉండండి.
మేరాజ్ రాత్రి ఇబ్రాహీం అలైహిస్సలాం వసియతు
ఇక రండి, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్ కు వెళ్ళిన రాత్రి ఎవరితో కలిశారు? ఈ జిక్ర్, నాలుగు వచనాల గురించి ఎవరు ఎలాంటి మనకు వసియతు చేశారో? అల్లాహు అక్బర్! వాస్తవంగా ఈ విషయాన్ని మనం వినేదుంటే చాలా సంతోషం, చాలా ఆనందం మనకు కలగాలి.
చూడండి ఈ హదీస్, షేఖ్ అల్బానీ (రహమహుల్లాహ్) సహీహ ఉత్తర్గీబ్‌లో ప్రస్తావించారు, 1550 హదీస్ నెంబర్. అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
لقيت إبراهيم ليلة أسري بي
లకీతు ఇబ్రాహీమ లైలత ఉస్రియ బి
(మేరాజ్ రాత్రి నేను ఇబ్రాహీంను కలిశాను)
నాకు మేరాజ్ జరిగిన రాత్రి ఇబ్రాహీం అలైహిస్సలాంను కలిశాను.
فقال يا محمد أقرئ أمتك مني السلام
ఫకాల యా ముహమ్మద్ అఖ్రి ఉమ్మతక మిన్నీ అస్సలామ్
(అప్పుడు అతను అన్నారు, ఓ ముహమ్మద్, నీ ఉమ్మత్ కు నా వైపు నుండి సలాం చెప్పు)
ఇబ్రాహీం అలైహిస్సలాం చెప్పారు, ‘యా ముహమ్మద్’, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ‘అఖ్రి ఉమ్మతక మిన్నీ అస్సలామ్’, నీ అనుచర సంఘానికి, నీ ఉమ్మతీయులకు నా వైపు నుండి సలాం తెలుపు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్! మనం ఎంత అదృష్టవంతులం అండి, ఇబ్రాహీం అలైహిస్సలాం మనకు సలాం చెబుతున్నారు. అల్లాహు తాలా మన ప్రవక్త పై, ఇబ్రాహీం అలైహిస్సలాం పై ఎనలేని, లెక్కలేనన్ని సలాములు, సలాతులు కురిపిస్తూ ఉండు గాక.
ఆ తర్వాత ఏం చెప్పారు?
وأخبرهم أن الجنة طيبة التربة عذبة الماء
వ అఖ్బిర్ హుమ్ అన్నల్ జన్నత తయ్యిబతుత్తుర్బహ్ అద్బతుల్ మా
(మరియు వారికి తెలియజేయి, స్వర్గం యొక్క మట్టి మంచిది మరియు నీరు తియ్యనిది)
మీరు వారికి తెలియజేయండి, అన్నల్ జన్నత తయ్యిబతుత్తుర్బహ్, స్వర్గం యొక్క మట్టి చాలా మంచిది, అద్బతుల్ మా, స్వర్గపు యొక్క నీరు చాలా తియ్యటి నీళ్ళు.
وأنها قيعان
వ అన్నహా కీఆనున్
(మరియు అది ఒక ఎడారి)
కానీ అది ఎడారిగా ఉంది. అందులో ఇంకా ఇప్పుడు ఏమి పంటలు లేవు. అయితే నీ కొరకు మంచి పంట అందులో కావాలి, మంచి తోటలు నీ కొరకు కావాలి అంటే ఏం చేయాలి?
سبحان الله، والحمد لله، ولا إله إلا الله، والله أكبر
సుబ్ హానల్లాహ్, వల్ హందులిల్లాహ్, వలా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్
(అల్లాహ్ పవిత్రుడు, మరియు ప్రశంసలన్నీ అల్లాహ్ కే, మరియు అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, మరియు అల్లాహ్ గొప్పవాడు)
అని పలుకుతూ ఒక్కొక్క దానికి బదులుగా ఒక్కొక్క చెట్టు అందులో నాటబడే రీతిలో నీవు ప్రయత్నం చేయాలి. గమనించారా? ఏంటి అయ్యా నీకు ఇంత పెద్ద భూమి ఉందంట, ఏంటి అందులో ఏం వ్యవసాయం చేయట్లేదా? అందులో ఏమైనా తోట, అందులో చెట్లు నాటడం లేదా అని ఎవరైనా అడిగితే ఏమంటారు మీరు? ఏం చేయాలయ్యా నా దగ్గర ఏం డబ్బు లేదు కదా, అందులో వ్యవసాయం చేయడానికి నా వద్ద అంత శక్తి లేదు కదా ఈ విధంగా మాటలు అంటూ ఉంటారు కదా? కానీ ఇది ఎంత, స్వర్గంలో మనం మంచి తోటలు మన కొరకు ఏర్పడాలంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత సులభతరమైన మార్గం మన కొరకు చూపారో.
ఒక వృద్ధురాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో అడిగిన విషయం
వాస్తవానికి సోదరులారా, ఇంతటి గొప్ప అవకాశాన్ని మనం ఏ మాత్రం కోల్పోకూడదు. ఈ భావంలో ఇంకా ఎందరో సహాబాల ఉల్లేఖనాలు ఉన్నాయి. కానీ వాటన్నిటినీ చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. ఇప్పుడు రండి, నేను మరొక విధమైన ఘనత మనకు తెలియడానికి, ప్రత్యేకంగా ఈ రోజుల్లో కొందరు ఎవరైతే పని లేక, ఉద్యోగం లేక, లేక రిటైర్డ్ అయిపోయి, ముసలితనంలో చేరి ‘ఏం చేయాలి, పిల్లలందరూ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఉన్నారు, ఒంటరిగా ఉండి పొద్దంతా చాలా బాధ కలుగుతుంది, ఎవరు మాట్లాడేవాడు లేడు’ ఇలాంటి రంధి, ఇలాంటి బాధలో ఎంతో మంది ఉన్నట్లు చూస్తున్నాము కదా మనం?
కానీ మనం ఇస్లాంలో ఉండి మన సమయం ఇలా ఎవరు మాట్లాడే వారు లేకుండా నా పొద్దంతా ఎంతో రంధిగా గడుస్తుంది అని అనడానికి అవకాశం ఉందా? ఇస్లాం ధర్మం తెలుసుకొని, ఖురాన్ చదువుతూ, ప్రవక్త యొక్క సీరత్ చదువుతూ, ఈ రోజుల్లో ఏమైనా వింటూ, యూట్యూబ్ లో మంచి ప్రసంగాలు చూస్తూ, అల్లాహ్ యొక్క జిక్ర్ అధికంగా చేస్తూ సమయం ఎంత మంచిగా గడపవచ్చు మనం? మనం మన సమయాన్ని ఎంత మంచి రీతిలో గడపవచ్చు? కానీ ఏంటి, ఇలాంటి అవగాహన లేక, ఇలాంటి అవగాహన లేక, ధర్మ జ్ఞానం యొక్క కొరత వల్ల ఎంతో బాధలో వారు గడుపుతూ ఉంటారు కానీ, ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయరు.
అయితే రండి, ఒక వృద్ధురాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో అడిగిన విషయం ఏంటో ఇప్పుడు మనం ఈ హదీస్ లో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. శ్రద్ధగా మీరు కూడా ఈ హదీస్ ను వినండి మరియు ఇందులో ఉన్నటువంటి ఘనతను మీరు స్వయంగా పొందే ప్రయత్నం చేయండి. మీ ఇళ్లల్లో ఎవరైనా పెద్ద మనుషులు ఇలాంటి బాధలో ఉంటే ఈ హదీస్ వినిపించి వారి బాధను దూరం చేయండి. వారి యొక్క సమయాన్ని ఎంతో ఆనందంగా గడిపే విధంగా మీరు వారికి నేర్పండి.
షేఖ్ అల్బానీ (రహమహుల్లాహ్) సహీహ ఉత్తర్గీబ్‌లో ప్రస్తావించారు ఈ హదీస్ ని. ఉమ్మె హాని (రదియల్లాహు అన్హా), వృద్ధురాలు, ఆమె ఏమంటుందో చూడండి:
مر بي رسول الله صلى الله عليه وسلم ذات يوم
మర్ర బీ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ దాత యౌమ్
(ఒక రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా దగ్గర నుండి వెళ్ళారు)
ఒకసారి ప్రవక్త నా దగ్గరి నుండి దాటారు.
فقلت يا رسول الله قد كبرت وضعفت
ఫకుల్తు యా రసూలల్లాహ్ ఖద్ కబిర్తు వ దౌఫ్తు
(నేను అన్నాను, ఓ ప్రవక్త, నేను వృద్ధురాలినైపోయాను మరియు బలహీనురాలినైపోయాను)
నేను చాలా వృద్ధురాలిని అయిపోయాను, చాలా బలహీనురాలిని అయిపోయాను.
فمرني بعمل أعمله وأنا جالسة
ఫముర్నీ బి అమలిన్ అ’మలుహు వ అన జాలిస
(కాబట్టి, కూర్చుని చేసే ఒక ఆచరణ నాకు తెలుపండి)
నేను కూర్చుండి కూర్చుండి చేసే అటువంటి ఏదైనా ఒక మంచి సత్కార్యం గురించి నాకు తెలపండి. అల్లాహు అక్బర్! చూస్తున్నారా? ఎలాంటి విషయం అడుగుతున్నారు? నేను ముసలిదాన్ని అయిపోయినా కదా, ఇప్పుడు ఇలాగే కూర్చుండి నా సమయం గడుస్తుంది, అయితే ఇలా నేను ఏ సత్కార్యం చేయగలుగుతాను? పుణ్యాలు సంపాదించడానికి ఎలాంటి మంచి మార్గాన్ని నేను పొందగలుగుతాను? అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
سبح الله مائة تسبيحة
సబ్బిహిల్లహ మిఅత తస్బీహ
(వంద సార్లు సుబ్ హానల్లాహ్’ అని పలుకు)
వంద సార్లు నీవు ‘సుబ్ హానల్లాహ్’ అని పలుకు. ఏంటి లాభం?
فإنها تعدل لك مائة رقبة تعتقينها من ولد إسماعيل
ఫఇన్నహా త’దిలు లకి మిఅత రకబతిన్ త’తికీనహా మిన్ వలది ఇస్మాయీల్
(ఇస్మాయీల్ సంతానం నుండి వంద బానిసలకు విముక్తి కలిగించినంత పుణ్యం నీకు లభిస్తుంది)
వంద సార్లు సుబ్ హానల్లాహ్ పలకడం ద్వారా నీకు లాభం ఏంటంటే, ఇస్మాయీల్ అలైహిస్సలాం సంతానంలోని వంద బానిసలకు విముక్తి కలిగించినంత పుణ్యం నీకు లభిస్తుంది.
واحمد الله مائة تحميدة
వహ్మదిల్లాహ మిఅత తహ్మీద
(వంద సార్లు ‘అల్ హందులిల్లాహ్’ పలుకు)
فإنها تعدل لك مائة فرس مسرجة ملجمة تحملين عليها في سبيل الله
ఫఇన్నహా త’దిలు లకి మిఅత ఫరసిన్ ముసర్రజతిన్ ముల్జమతిన్ తహ్మిలీన అలైహా ఫీ సబీలిల్లాహ్
(అల్లాహ్ మార్గంలో జీను మరియు కళ్ళెం వేసిన వంద గుర్రాలను దానం చేసినంత పుణ్యం నీకు లభిస్తుంది)
వంద సార్లు నువ్వు అల్ హందులిల్లాహ్ పలుకుతే నీవు వంద గుర్రాలు జీనుతో పాటు కళ్ళెం వేసినవి అల్లాహ్ మార్గంలో ఇచ్చినటువంటి పుణ్యం నీకు లభిస్తుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్! గమనిస్తున్నారా?
وكبر الله مائة تكبيرة
వకబ్బిరిల్లాహ మిఅత తక్బీర
(వంద సార్లు ‘అల్లాహు అక్బర్’ అని పలుకు.)
فإنها تعدل لك مائة بدنة مقلدة متقبلة
ఫఇన్నహా త’దిలు లకి మిఅత బదనతిన్ ముఖల్లదతిన్ ముతఖబ్బల
(అల్లాహ్ కొరకు బలిదానం చేసి, స్వీకరించబడిన వంద ఒంటెల పుణ్యం నీకు లభిస్తుంది)
నీవు వంద ఒంటెలు వాటికి పట్టాలు వేసి అల్లాహ్ కొరకు బలిదానం చేయడానికి పంపిన మరియు అల్లాహ్ వద్ద అవి స్వీకరించబడిన దానికి సమానమైన పుణ్యం లభిస్తుంది. చూస్తున్నారా, ప్రియ వీక్షకులారా గమనిస్తున్నారా?
ఇక రండి,
وهلل الله مائة تهليلة
వహల్లిలిల్లాహ మిఅత తహ్లీల
(వంద సార్లు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అని పలుకు)
ఏమవుతుంది?
تملأ ما بين السماء والأرض
తమ్లఉ మా బైనస్సమాఇ వల్ అర్ద్
(భూమి మరియు ఆకాశాల మధ్య ఉన్న స్థలాన్ని నింపుతుంది)
భూమి ఆకాశాల మధ్యలోని స్థలాన్ని అది నింపేస్తుంది. అంటే అంత ఎక్కువ పుణ్యాలు లభిస్తాయి అని భావం. మరొక లాభం వినండి.
ولا يرفع يومئذ لأحد عمل إلا أن يأتي بمثل ما أتيت
వలా యుర్ఫఅ యౌమఇదిన్ లిఅహదిన్ అమలున్ ఇల్లా అన్ య’తియ బిమిథ్లి మా అతైత్
(ఆ రోజు నీ కంటే ఉత్తమమైన సత్కార్యం ఎవరిదీ కూడా అల్లాహ్ వద్ద హాజరు చేయబడదు, నీలాంటి సత్కార్యం ఎవరైనా చేస్తే తప్ప)
ఆ రోజు నీ కంటే ఉత్తమమైన సత్కార్యం ఎవరిది కూడా అల్లాహ్ వద్ద హాజరు చేయబడదు. ఆ, నీలాంటి సత్కార్యం ఎవరైనా చేస్తే వారిది కూడా పెట్టబడుతుంది, అది వేరే విషయం. చూశారా, ఈ నాలుగు పదాల ఘనతలు ఎంత గొప్పగా ఉన్నాయో? వంద సార్లు సుబ్ హానల్లాహ్ కు బదులుగా వంద బానిసలను విముక్తి కలిగించినంత. వంద సార్లు అల్ హందులిల్లాహ్ కు బదులుగా వంద గుర్రాలు జీనుతో, కళ్ళాలతో అల్లాహ్ మార్గంలో ఇచ్చినటువంటి పుణ్యం. వంద సార్లు అల్లాహు అక్బర్, వంద ఒంటెలను బలిదానం చేసినంత, స్వీకరించబడినవి ఎలా ఉంటాయో అలాంటి పుణ్యం. వంద సార్లు లా ఇలాహ ఇల్లల్లాహ్ ఇది భూమి ఆకాశాలను పుణ్యాలతో నింపేస్తుంది. మరియు ఇంతకంటే మంచి ఆచరణ మరెవరిది కూడా ఉండదు.
అల్లాహ్‌కు అత్యంత ప్రియమైనవి మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా ఎంతో ప్రియమైనవి
సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఇంకా మనం ‘సుబ్ హానల్లాహి వల్ హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్’ అన్నటువంటి ఈ నాలుగు శుభ వచనాల ఘనతలను వేరు వేరు రకాలుగా తెలుసుకుంటున్నాము. అయితే సోదర మహాశయులారా, మరికొన్ని హదీసులు మనకు ఎలాంటివి దొరుకుతున్నాయంటే, సహీహ్ ముస్లిం ఇంకా వేరే సహీహ్ హదీసుల్లో ఈ నాలుగు వచనాలు అల్లాహ్‌కు అత్యంత ప్రియమైనవి మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా ఎంతో ప్రియమైనవి అని తెలుస్తున్నది. ఎంతో ప్రియమైనవి.
ఈ మాట ఇంతే సంక్షిప్తంగా చెప్తున్నాను, సహీహ్ హదీసుల్లో వాటి మాట, వాటి యొక్క ప్రస్తావన వచ్చి ఉంది. మీరు ఇక్కడ ఒకే విషయం ఆలోచించుకోండి, అధికంగా ఈ నాలుగు శుభ వచనాలు చదువుతూ ఉండండి. అల్లాహ్‌కు మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అత్యంత ప్రియమైన పలుకులు మీరు చదువుతున్న భావాన్ని మీరు మీ మనసులో నాటుకోండి.
హజ్ చేసినంత, ఉమ్రా చేసినంత, జిహాద్‌లో అల్లాహ్ మార్గంలో డబ్బు ఖర్చు పెట్టినంత మరియు అధికంగా, అధికంగా దానధర్మాలు చేసిన దానికంటే ఎక్కువ పుణ్యం
ఇక ఆ తర్వాత రండి, మరొక ఘనత గురించి సంక్షిప్తంగా నేను చెప్తాను, ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో దీని ప్రస్తావన వచ్చింది. అదేంటి? సుబ్ హానల్లాహ్, వల్ హందులిల్లాహ్, వల్లాహు అక్బర్, ఈ మూడు పదాలు ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత మనం చదువుతూ ఉంటే, హజ్ చేసినంత, ఉమ్రా చేసినంత, జిహాద్‌లో అల్లాహ్ మార్గంలో డబ్బు ఖర్చు పెట్టినంత మరియు అధికంగా, అధికంగా దానధర్మాలు చేసిన దానికంటే ఎక్కువ పుణ్యం లభిస్తూ ఉంటుంది.
పుణ్యాల త్రాసులో అవి ఎంతో బరువు గలవి
మరో రకమైన సత్కార్యం గురించి నేను షేఖ్ అల్బానీ (రహమహుల్లాహ్) సహీహ ఉత్తర్గీబ్‌లో ప్రస్తావించిన హదీస్ ను మీ ముందు పెట్టి, దానిని సంక్షిప్తంగా వివరిస్తాను. శ్రద్ధగా వినండి. మరియు అలాగే ఆ హదీస్ మీలో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కూడా నేర్చుకోవచ్చు. అందుకొరకే దీనిని నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఈ హదీస్ వినిపించేకి ముందు ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. పైన మీరు చూస్తున్నారు.
وعن أبي سلمى راعي رسول الله صلى الله عليه وسلم قال سمعت رسول الله صلى الله عليه وسلم يقول
వ అన్ అబీ సల్మ రాఈ రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ కాల్ సమీతు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ యకూల్
(ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మేకల కాపరి అయిన అబూ సలమా ఉల్లేఖిస్తున్నారు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతుండగా విన్నాను)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మేకల కాపరి అయిన అబూ సలమా ఉల్లేఖిస్తున్నారు ఈ హదీస్ ని. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది మీకు? ఆనాటి కాలంలో ఉన్నటువంటి బానిసలు గాని, కాపరి లాంటి వారు గాని, ప్రవక్త ద్వారా ధర్మ విద్య నేర్చుకునే విషయంలో కూడా ఎంత ముందుగా ఉండేవారు. మరి ఆయన ఏమంటున్నారు?
سمعت
సమితు
(నేను విన్నాను)
నేను ప్రవక్తతో విన్నాను. ఎక్కడ ఎవరో, ఎవరితో విన్న విషయం కాదు. స్వయంగా ప్రవక్తతో విని ఆయన ఉల్లేఖిస్తున్నారు. అయితే మనం ఈ రోజుల్లో అయ్యా రండి కొంచెం ధర్మం నేర్చుకుందాము, ఈ రోజు ఖురాన్ దర్స్ నడుస్తుంది వచ్చేసేయండి, ఇగో హదీస్ చెబుతున్నారు ఈ రోజు, అయ్యో అది, మీలాంటి చదువరులకయ్యా మాకు, మాలాంటి పామరులకు, మాలాంటి విద్య లేని వారికి ఇవన్నీ ఏమీ ఎక్కడ మా బుర్రలో దిగవు, ఇలా అంటారు కదా కొందరు? తప్పు మాట. ధర్మ విషయం నేర్చుకోవడానికి కనీసం వినడానికి వెనక ఉండకూడదు.
అయితే ఈ హదీస్ లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటో గమనించండి. ఈ నాలుగు పదాల ప్రస్తావన ఉంది ఇందులో, కానీ దాని గురించి ఏమంటున్నారు?
بخ بخ
బఖిన్ బఖిన్
(చాలా మంచివి, చాలా మంచివి)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతున్నారు: బఖిన్ బఖిన్,
لخمس
లి ఖమ్సిన్
(ఐదు విషయాలు)
ఐదు విషయాలు ఎంత మంచివి, చాలా మంచివి.
ما أثقلهن في الميزان
మా అథ్ ఖలహున్న ఫిల్ మీజాన్
(పుణ్యాల త్రాసులో అవి ఎంత బరువు గలవి)
పుణ్యాల త్రాసులో అవి చాలా బరువు గలవి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్! గమనిస్తున్నారా? ప్రళయ దినాన ఏం జరుగుతుంది? సూరతుల్ ము’మినూన్, సూరతుల్ అ’రాఫ్, అలాగే ఇదా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా, ఇవన్నీ సూరలలో ఏం తెలుస్తుంది మనకు? అల్లాహు తాలా, అలాగే సూరతుల్ అంబియా ఆయత్ నెంబర్ 25లో కూడా చూడొచ్చు మీరు. ప్రళయ దినాన త్రాసును నెలకొల్పుతాడు. పుణ్యాలను అందులో తూకం చేయడం జరుగుతుంది. పాపాలను తూకం చేయడం జరుగుతుంది. పుణ్యాలు బరువుగా ఉన్నప్పుడే మనం స్వర్గంలోకి వెళ్తాము.
والوزن يومئذ الحق
వల్ వజ్ను యౌమఇదిన్ ఇల్ హఖ్
(ఆ రోజు త్రాసు సత్యం)
ఆ రోజు త్రాసును నెలకొల్పడం ప్రజల యొక్క ఆచరణలను, వారి యొక్క కర్మ పత్రాలను, చివరికి స్వయం వారినీ కూడా తూకం చేయడం జరుగుతుంది.
فمن ثقلت موازينه
ఫమన్ థఖులత్ మవాజీనుహు
(ఎవరి త్రాసు పళ్ళెం బరువుగా ఉంటుందో)
ఎవరి త్రాసు పళ్ళెం బరువుగా ఉంటుందో అలాంటి వారే సాఫల్యం పొందుతారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు ప్రవక్త ఈ హదీస్ లో?
ما أثقلهن في الميزان
మా అథ్ ఖలహున్న ఫిల్ మీజాన్
(పుణ్యాల త్రాసులో అవి ఎంతో బరువు గలవి)
ఈ ఐదు విషయాలు చాలా మంచివి, చాలా మంచివి. ఇవి త్రాసులో, పుణ్యాల త్రాసులో చాలా చాలా బరువుగా ఉంటాయి. ఏంటండీ అవి? లా ఇలాహ ఇల్లల్లాహ్, వ సుబ్ హానల్లాహ్, వల్ హందులిల్లాహ్, వల్లాహు అక్బర్. ఈ నాలుగు పదాలు మరొక ఆచరణ గురించి చెప్పడం జరిగింది, అదేంటి?
والولد الصالح يتوفى للمرء المسلم فيحتسبه
వల్ వలదుస్సాలిహు యుతవఫ్ఫా లిల్ మర్ఇల్ ముస్లిం ఫయహ్ తసిబుహు
(ఒక ముస్లిం వ్యక్తి యొక్క పుణ్యాత్ముడైన సంతానం చనిపోతే, అతను అల్లాహ్ తో పుణ్యాన్ని ఆశించి ఓపిక వహిస్తాడు)
ఒక ముస్లిం వ్యక్తి యొక్క పుణ్యాత్ముడైన సంతానం, అల్లాహు అక్బర్ ఇక్కడ గమనించండి,
الولد الصالح
వల్ వలదుస్సాలిహ్
(పుణ్యాత్ముడైన సంతానం)
సాలిహ్ ఔలాద్, మంచి సంతానం, యుతవఫ్ఫా చనిపోతాడు. లిల్ మర్ఇల్ ముస్లిం, ఒక ముస్లిం వ్యక్తి యొక్క మంచి సంతానం. అయితే ఆ ముస్లిం వ్యక్తి ఏం చేస్తాడు? ఫయహ్ తసిబుహు, అతను అల్లాహ్ తో పుణ్యాన్ని ఆశించి ఓపిక, సహనాలు వహిస్తాడు. అయ్యయ్యో, ఏంటి దేవుడా, నాకు ఒకే ఒక్క కొడుకు ఉండే నువ్వు తీసుకుంటివా, ఇలాంటి షిక్వా షికాయత్, ఇలాంటి తప్పుడు మాటలు తన నోటితో రానివ్వడు. ఇలా ఓపిక సహనాలతో అల్లాహ్ తో పుణ్యాన్ని ఆశించి ఉండే వ్యక్తి యొక్క ఈ ఆచరణ కూడా పుణ్యాల త్రాసులో చాలా బరువుగా ఉంటుంది.
మన అంశానికి మనం మళ్ళీ తిరిగి వచ్చేద్దాం. లా ఇలాహ ఇల్లల్లాహ్, సుబ్ హానల్లాహ్, అల్ హందులిల్లాహ్, అల్లాహు అక్బర్, ఈ నాలుగు శుభ వచనాలు ఎంత గొప్ప ఘనత గలవి అంటే ప్రళయ దినాన త్రాసులో వీటి బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. అందు గురించి మీరు లెక్కలేకుండా మీ యొక్క పనిలో మీరు నిమగ్నులవుతూ కూడా మీ నాలుకను అల్లాహ్ యొక్క ఇలాంటి జిక్ర్ లో నిమగ్నులై ఉండే విధంగా ప్రయత్నిస్తూ ఉండండి.
ప్రతి వ్యక్తిపై ప్రతి ఉదయం 360 కీళ్లకు, కీళ్లలోని ప్రతి కీలుకు బదులుగా ఒక దానం చేయడం మీపై విధిగా ఉంది
ఇప్పుడు రండి, ఒక హదీస్ చూపిస్తాను. అందులో మన కొరకు చాలా లాభదాయకమైన విషయం ఒకటి ఉంది. మరి కొన్ని వేరే విషయాలు కూడా అందులో ఉన్నాయి. అవన్నీ కూడా పుణ్యాలకు మన యొక్క సత్కార్యాలు పెంచడానికి చాలా చాలా ముఖ్యమైనవి. అయితే జిక్ర్ యొక్క ప్రస్తావన కూడా అందులో చాలా గొప్పగా వచ్చి ఉంది. వాస్తవానికి ముస్లిం షరీఫ్‌లోని హదీస్. కానీ ఈ హదీస్ నేను మీ ముందు తెలియజేయడానికి ఏంటంటే, ఈ రోజుల్లో ఎన్నో పనులు మనం చేస్తూ ఉంటాము. అక్కడ ఒక మాట చెబుతాము, ఏ మాట? ఏందండీ, ఇక బాధ్యత కదా, చేయకుంటే ఎట్లా, ఈ విధంగా ఒక మాట మనం అంటూ ఉంటాము.
కానీ వాస్తవానికి మనకు ఇంత బాధ్యతా భావం మనలో ఉన్నప్పుడు మరొక గొప్ప విషయం మనలో ఉండాలి. అదేంటి? ప్రియారిటీస్. మన ముందు నాలుగు బాధ్యత గల విషయాలు వస్తే వాటిలో దేనిని ముందు చేయాలి, దేనిని ఎక్కువగా చేయాలి, దేనికి ప్రాధాన్యతను ఇవ్వాలి, ఇవన్నీ తెలిసి ఉండడం కూడా చాలా ముఖ్యం. ఇది తెలిసి లేకుంటే మనం చాలా చాలా నష్టపోతాము. ఈ విషయం అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఉదాహరణకు మీరే ఒక డాక్టర్‌గా పని చేస్తున్నారనుకోండి. మీ ముందు ఒక పేషెంట్ వచ్చాడు. మీ ముందు ఒక పేషెంట్ వచ్చాడు, ఏంటి, తలనొప్పి, కడుపునొప్పితో వచ్చాడు. మీరు అతన్ని చూస్తూ ఉన్నారు. అంతలోనే యాక్సిడెంట్ అయి, తల పగిలి, కాళ్ళు విరిగి ఒక పేషెంట్ వస్తే ఏమంటారు మీరు? ఆహా ఉండనీవయ్యా వాణ్ని తర్వాత చూద్దాము, ఇక్కడ ఈ తలనొప్పి కడుపునొప్పి ఉన్న వ్యక్తిని చూసుకుంటూ ఉందాము ముందు, ఇతను ముందు వచ్చాడు కదా అని అంటారా? లేదు కదా? ఏ సందర్భంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి, దాన్ని గమనిస్తారు.
అయితే, మన ముందు నాలుగు రకాల సత్కార్యాలు ఉంటే, మన ముందు ఎన్నో పుణ్య కార్యాలు ఉంటే, మనం వేటికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి అది కూడా మనం తెలుసుకొని ఉండాలి. మరియు సర్వసామాన్యంగా ఒక మాట చెప్పాలంటే, పరలోకానికి ప్రాధాన్యతను ఇవ్వాలి ఇహలోకంపై. ఈ విషయమే అల్లాహు తాలా అనేక సందర్భాలలో మనకు తెలిపాడు. సర్వసామాన్యంగా జుమా నమాజ్‌లోని మొదటి రకాత్‌లో చదివే అటువంటి సూరతుల్ అ’లా:
والآخرة خير وأبقى
వల్ ఆఖిరతు ఖైరున్ వ అబ్ఖా
(పరలోకం ఉత్తమమైనది మరియు శాశ్వతమైనది)
పరలోక దినం అనేది శాశ్వతంగా ఉండేది. అక్కడి జీవితం స్వర్గ రూపంలో మీకు లభించింది అంటే అదే మీ కొరకు చాలా మేలైనది. అందుకొరకు దానికి ప్రాధాన్యతను ఇవ్వండి. మరి ఎవరైతే ఈ లోకానికి ప్రాధాన్యతను ఇస్తారో, వారు ఎంత నష్టపోతారో కూడా ఖురాన్‌లో అనేక సందర్భంలో చెప్పడం జరిగింది. అయితే రండి, ఇవన్నీ మాటలు చెప్పిన తర్వాత ఇక మీరు ఇప్పుడు నేను చెప్పబోయే, మీకు చూపిస్తూ వినిపించబోయే ఈ హదీస్ పై శ్రద్ధ వహించండి. హజరత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖిస్తున్నారు. షేఖ్ అల్బానీ (రహమహుల్లాహ్) సహీహ ఉత్తర్గీబ్‌లో దీనిని ప్రస్తావించారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
خلق كل إنسان من بني آدم على ستين وثلاثمائة مفصل
ఖులిఖ కుల్లు ఇన్సానిమ్ మిన్ బనీ ఆదమ అలా సిత్తీన వ థలాథి మిఅతి మిఫ్సల్
(ప్రతి ఆదం కుమారుడు 360 కీళ్లతో సృష్టించబడ్డాడు)
ప్రతి మనిషి, ఆదం కుమారుడు, అతనికి 360 కీళ్లు అల్లాహు తాలా ప్రసాదించాడు. అయితే, ముస్లిం షరీఫ్‌లోని మరొక ఉల్లేఖనం తెలుసు కదా మీకు?
يصبح على كل سلامى من أحدكم صدقة
యుస్బిహు అలా కుల్లి సులామా మిన్ అహదికుమ్ సదఖహ్
(మీలో ప్రతి ఒక్కరిపై ప్రతి ఉదయం ఒక దానం విధిగా ఉంది)
మీలో ప్రతి వ్యక్తిపై ప్రతి ఉదయం 360 కీళ్లకు, కీళ్లలోని ప్రతి కీలుకు బదులుగా ఒక దానం చేయడం మీపై విధిగా ఉంది. అయితే,
فمن كبر الله
ఫమన్ కబ్బరల్లాహ్
(ఎవరైతే ‘అల్లాహు అక్బర్’ అంటారో)
ఎవరైతే ఒక్కసారి ‘అల్లాహు అక్బర్’ అంటారో, అతడు ఒక దానం చేసినట్లు. ఒక కీలుకు బదులుగా అల్లాహ్ యొక్క కృతజ్ఞత ఆ రోజు చెల్లించినట్లు.
وحمد الله
వ హమిదల్లాహ్
(ఎవరైతే ‘అల్ హందులిల్లాహ్’ అని పలుకుతారో)
ఎవరైతే అల్లాహ్ యొక్క స్తోత్రము అంటే ‘అల్ హందులిల్లాహ్’ అని పలుకుతారో,
وهلل الله
వ హల్లలల్లాహ్
(ఎవరైతే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అంటాడో,)
وسبح الله
వ సబ్బహల్లాహ్
(ఎవరైతే అల్లాహ్‌ను స్తుతిస్తారో)
మరి ఎవరైతే ‘సుబ్ హానల్లాహ్’ అని అంటాడో,
واستغفر الله
వస్తగ్ఫరల్లాహ్
(మరియు ఎవరైతే అల్లాహ్‌ను క్షమాపణ కోరుతారో)
మరి ఎవరైతే ‘అస్తగ్ఫిరుల్లాహ్, ఓ అల్లాహ్ నేను నీతో నా పాపాల నుండి క్షమాపణ కోరుతున్నాను’ అని అంటారో, ఈ విధంగా అర్థమైంది కదా? ఇక్కడ ఈ హదీస్ లో గమనించండి మీరు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 360 కీళ్లకు బదులుగా ఏ దానధర్మాలు చేయడం మనపై విధిగా ఉందో, దాని యొక్క రకాలు తెలిపారు. డబ్బు రూపంలోనే కాదు దానధర్మం. ఈ రకంగా కూడా.
అయితే ఇక ఎవరైతే పొద్దంతలో కనీసం ఒక్కసారి కూడా ‘సుబ్ హానల్లాహ్, అల్ హందులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్’ చదవడో, అతడు తిన్న పళ్లెంలోనే నమఖరామి అంటాం చూడండి? అంటే తిన్న పళ్లెంలోనే ద్రోహం చేసేవాడు అన్నట్లుగా, అల్లాహ్‌కు కృతజ్ఞత, ధన్యవాదాలు ఏదైతే చెల్లించాలో, చెల్లించకుండా ఎంత దూరమైపోతున్నాడు?
అయితే, ఈ శుభ వచనాలతో పాటు మరికొన్ని సత్కార్యాల ప్రస్తావన కూడా ఇందులో వచ్చింది.
وأزال حجرا عن طريق المسلمين
వ అజల హజరన్ అన్ తరీకిల్ ముస్లిమీన్
(ముస్లింల మార్గం నుండి ఒక రాయిని తొలగించాడు)
ముస్లింల మార్గం నుండి ఏదైనా రాయిని దూరం చేశాడు. అంటే దారిలో ఎవరికీ ఆ రాయి వల్ల కాటు రాయి తగలకూడదు, ఎవరికీ నష్టం జరగకూడదు అని.
أو شوكة
అవ్ షౌకతన్
(లేదా ముల్లు)
లేదా ముల్లు ఉంటే దాన్ని తీసి దూరం పడేశాడు.
أو عظما
అవ్ అజ్మన్
(లేదా ఎముక)
ఎముక పడి ఉన్నది, ఎవరికైనా కుచ్చుకుకుంటుంది, బాధ కలిగిస్తుంది అని దూరం చేశాడు. అలాగే,
وأمر بمعروف
వ అమర బి మ’రూఫ్
(ఒక మంచిని గురించి ఆదేశించాడు)
أو نهى عن منكر
అవ్ నహా అన్ మున్కర్
(లేదా చెడు నుండి ఖండించాడు)
عدد تلك الستين والثلاثمائة سلامى
ఆదద తిల్కస్సిత్తీన వ థలాథి మిఅతిస్సులామా
(ఆ 360 కీళ్ల సంఖ్యకు)
ఈ విధంగా మొత్తం 360, 360 పుణ్యాల, 360 కీళ్లకు బదులుగా ఇట్లాంటి పుణ్య కార్యాలు చేసుకొని వాటి హక్కును నెరవేర్చాడు. లాభం ఏముంది చూడండి?
فإنه يمسي يومئذ وقد زحزح نفسه عن النار
ఫఇన్నహు యుమ్సీ యౌమఇదిన్ వఖద్ జహ్ జహ నఫ్సహు అనిన్నార్
(ఆ రోజు అతను సాయంకాలానికి చేరుకుంటాడు, మరియు అతను తనకు తాను నరకం నుండి దూరం ఉంచుకుంటాడు)
ఆ రోజు అతను సాయంకాలానికి చేరుకుంటాడంటే అతను తనకు తాను నరకం నుండి దూరం ఉంచుకుంటాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్!
సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఎవరైతే ప్రతి రోజు కనీసం ఈ 360 రకాల సత్కార్యాలు, వాటిలో చాలా ముఖ్యమైనవి ‘సుబ్ హానల్లాహ్, అల్ హందులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్’, ఈ సత్కార్యాలు చేసుకోడో, అతడు తనకు తాను నరకం నుండి దూరం చేసుకున్న వాడు కాడు. మరి నరకం నుండి దూరం ఉండకుంటే లాభంలో ఉంటామా, లేక నష్టంలో ఉంటామా, ఇక మీరే ఆలోచించాలి.
ఒక గ్రామీణుడు వచ్చాడు. వచ్చి, నాకు ఒక నాలుగు మంచి పదాలు నేర్పండి అన్నాడు
ఇంకా మనం హదీస్ గ్రంథాల్లో చూస్తే, వాస్తవానికి ఎన్నో రకాల ఘనతలు ఈ నాలుగు శుభ వచనాల గురించి వస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఎడారిలో ఉండే వారు మరియు ఖానాబదోష్ అంటాము ఉర్దూలో, అంటే నాలుగు రోజులు ఇక్కడ ఉన్నారు, నాలుగు రోజులు అక్కడ ఉన్నారు, తమ ఇల్లు, తమ ఇంటి సామాగ్రి తమ వీపుపై ఉంటుంది. మోసుకుని వెళ్తారు, కొద్ది రోజులు అక్కడ ఉంటారు, కొద్ది రోజులు అక్కడ ఉంటారు. అలాంటి వారు కొన్ని సందర్భాల్లో వచ్చి ప్రవక్తతో నాకు ఏదైనా మంచి విషయం నేర్పండి అని అన్నప్పుడు ఈ నాలుగు విషయాలు నేర్పారు. ఒక సందర్భంలో ఒక గ్రామీణుడు వచ్చాడు. వచ్చి, నాకు ఒక నాలుగు మంచి పదాలు నేర్పండి అని అంటే ప్రవక్త ఈ నాలుగు పదాలు నేర్పాడు, నేర్పారు. ఆ వ్యక్తి అన్నాడు, ఇవి అల్లాహ్ యొక్క స్మరణ, స్తుతిలో ఉన్నాయి కదా, నా కొరకు ఏమున్నాయి అని అంటే,
اللهم اغفر لي، اللهم ارحمني، اللهم ارزقني
అల్లాహుమ్మగ్ ఫిర్లీ, అల్లాహుమ్మర్ హమ్నీ, అల్లాహుమ్మర్ జుఖ్నీ
(ఓ అల్లాహ్, నన్ను క్షమించు, ఓ అల్లాహ్, నన్ను కరుణించు, ఓ అల్లాహ్, నాకు జీవనోపాధిని ప్రసాదించు)
ఇలాంటి ఈ పదాలు పలుకు అని మళ్ళీ నాలుగు ఆ పదాలు నేర్పారు.
اللهم اغفر لي وارحمني واهدني وارزقني
అల్లాహుమ్మగ్ ఫిర్లీ వర్ హమ్నీ వహ్‌దినీ వర్ జుఖ్నీ
(ఓ అల్లాహ్, నన్ను క్షమించు, నన్ను కరుణించు, నాకు మార్గదర్శకత్వం ఇవ్వు, మరియు నాకు జీవనోపాధిని ప్రసాదించు)
ఆ వ్యక్తి ఎంతో సంతోషంతో వెళ్ళాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తిని చూసి, ఒకవేళ వాస్తవంగా ఈ వ్యక్తి వీటిని ఆచరిస్తూ ఉన్నాడంటే అతడు ఎన్నో రకాల మేళ్లను పొందిన వాడయ్యాడు.
ఇది నరకం నుండి మీ యొక్క ఢాలు
చివరిలో ఇంకా మాటలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. కానీ చివరిలో నేను ఒక హదీస్ మీకు చూపిస్తున్నాను. మరియు వినిపిస్తున్నాను, వాటి యొక్క అనువాదం కూడా తెలియజేస్తున్నాను, శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. అదేమిటంటే మనం ఇహలోకంలో ఎన్నో రకాల నష్టాల నుండి మనకు మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తాము. చేస్తామా, చేయమా?
ఎండకాలంలో ఉన్నప్పుడు కొంచెం చలిగా ఉండాలి మంచిగా అని చలి డ్రెస్సులు తొడుక్కుంటాము. ఫ్యాన్లు పెట్టుకుంటాము, ఏసీలు పెట్టుకుంటాము, అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాము. అయితే, ఈ లోకంలోనైతే మనం అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తున్నాము. నరకం నుండి రక్షణకై మనం ఏమైనా చేస్తున్నామా? మరియు ఈ జిక్ర్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఎంత గొప్ప శుభవార్త ఇచ్చారో, ప్రళయ దినాన ఎవరూ కూడా మనకు ఎలాంటి లాభం చేకూర్చని, ఎవరు ఎవరికీ సిఫారసు చేయలేని ఆ రోజుల్లో మన ముందు, మన వెనక, మన ఎడమ వైపున, మన కుడి వైపున హాజరై మనల్ని కాపాడే వారు, అల్లాహ్ యొక్క దయతో ఎవరు? అదే విషయం ఇప్పుడు మీరు చూడబోతున్నారు. శ్రద్ధగా వింటారు, చూస్తారు అని ఆశిస్తున్నాను.
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
خذوا جنتكم
ఖుదూ జున్నతకుమ్
(మీ యొక్క ఢాలు తీసుకోండి)
చూస్తున్నారా ఇక్కడ? ఖుదూ జున్నతకుమ్, మీరు మీ యొక్క ఢాలు తీసుకోండి. ఢాలు తీసుకోండి అంటే ఏంటి? చెబుతాం కదా, నీపై దాడి జరగనుంది, వెంటనే మీ ఢాలు తీసుకోండి. ఇక ఈ రోజుల్లో మన పిల్లలు కొందరు స్కూల్లలో కూడా కరాటే నేర్చుకుంటూ ఉంటారు కదా? ‘అటాక్ డిఫెన్స్, త్వరగా, నీవు డిఫెన్స్ పొజిషన్లో ఉండాలి, ఎందుకు, నీపై దాడి జరగనుంది’. అలాగే కరాటే మైదానంలో ఉన్నారు స్టూడెంట్స్, ఇద్దరికీ, ముగ్గురికీ ఈ విధంగా ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాడు కదా ట్రైనర్, ఆ సందర్భంలో ఒకరి పేరు తీసుకొని ‘ఆ, రైట్ మొదలు పెట్టు’, మరొకరిని ‘డిఫెన్స్’. అయితే ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల ముందు, ఖుదూ జున్నతకుమ్, డిఫెన్స్ పొజిషన్లో వచ్చేసేయండి, మీ ఢాలు తీసుకోండి. అయితే వెంటనే సహాబాలు అడిగారు:
أمن عدو قد حضر
అమిన్ అదువ్విన్ ఖద్ హదర్
(ఏంటి ప్రవక్త, శత్రువులు వచ్చేసారా?)
ఏంటి ప్రవక్త, శత్రువులు వచ్చేసారా? శత్రువుల దాడి జరగనుందా? మాకు మా డిఫెన్స్ సామానంతా కూడా తీసుకోమని చెబుతున్నారు?
قال لا ولكن جنتكم من النار
ఖాల లా వలాకిన్ జున్నతకుమ్ మినన్నార్
(ప్రవక్త అన్నారు, కాదు, కానీ ఇది నరకం నుండి మీ యొక్క ఢాలు)
శత్రువులు హాజరు కాలేదు, కానీ నరకం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకునే అటువంటి డిఫెన్స్ సామాగ్రిని మీరు సమకూర్చుకోండి. అల్లాహు అక్బర్! మళ్ళీ ప్రవక్త చెప్పారు:
قولوا سبحان الله والحمد لله ولا إله إلا الله والله أكبر
ఖూలూ సుబ్ హానల్లాహ్ వల్ హందులిల్లాహ్ వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్
(మీరు చెప్పండి, అల్లాహ్ పవిత్రుడు, ప్రశంసలన్నీ అల్లాహ్ కే, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, మరియు అల్లాహ్ గొప్పవాడు)
అల్లాహు అక్బర్, సుబ్ హానల్లాహ్ సోదరులారా, సోదరీమణులారా, ఈ రోజుల్లో మనం ఎంత అశ్రద్ధలో ఉన్నామో గమనించండి, అల్లాహు అక్బర్! అల్లాహ్ మనందరికీ హిదాయత్ ఇవ్వు గాక.
సహాబాల మధ్యలో ఉండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కొక్కసారి ఎలా నరకం నుండి వారిని హెచ్చరించేవారు? నరకం నుండి మనం రక్షణ పొందడానికి ఎంత మంచి సులభతరమైన మార్గాలు మనకు ప్రవక్త నేర్పుతున్నారు, కానీ ఈ పదాలు పలకడం కూడా ఈ రోజుల్లో మనకు ఎంత భారీగా అయిపోయింది? ఎందుకు, అంతటి ప్రపంచ వ్యామోహంలో, సోషల్ మీడియాలో, ఇంకా టిక్ టాక్ ఏదేదో అని పనికిమాలిన విషయాల్లో మనం మునిగిపోయి, ఇలాంటి మంచి విషయాల నుండి అశ్రద్ధలో ఉన్నాము.
మీరు నరకం నుండి కాపాడుకోవడానికి ఈ పదాలు అధికంగా పలకండి: ‘సుబ్ హానల్లాహ్, వల్ హందులిల్లాహ్, వలా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్’. మాట ఇంతటితో పూర్తి కాలేదు. ఆ తర్వాత ప్రవక్త వారు ఏమంటున్నారో అది గమనించండి.
فإنهن يأتين يوم القيامة
ఫఇన్నహున్న య’తీన యౌమల్ ఖియామ
(నిశ్చయంగా, అవి ప్రళయ దినాన వస్తాయి)
ప్రళయ దినాన ఈ పదాలు హాజరవుతాయి. ఈ శుభ వచనాలు హాజరవుతాయి. ఎలా?
مجنبات
ముజన్నిబాత్
(మీ రెండు పక్కల్లో)
ومعقبات
వ ముఅఖ్ఖిబాత్
(మీ వెనుకలో)
మీ వెనుకలో. మరొక ఉల్లేఖనంలో ఉంది,
مقدمات
ముఖద్దిమాత్
(మీ యొక్క ముందు)
మీ యొక్క ముందు. అంటే ప్రళయ దినాన నరక శిక్ష మీకు మీ ముందు నుండి, మీ పక్కల నుండి, మీ వెనక నుండి ఎటువైపు నుండి వచ్చినా, అంతకు ముందే ఈ నాలుగు శుభ వచనాలు మీరు ఏదైతే ఇహలోకంలో అధికంగా పలుకుతూ ఉండేవారో, మీకు మంచి రక్షణ సాధనంగా హాజరవుతాయి. అంతేకాదు,
وهن الباقيات الصالحات
వహున్నల్ బాఖియాతుస్సాలిహాత్
(అవే మిగిలి ఉండే అసలైన సత్కార్యాలు)
అవే మిగిలి ఉండే అసలైన సత్కార్యాలు. మిగిలి ఉండే అసలైన సత్కార్యాలు అంటే? ఇహలోకంలో మనం చేసుకునే సత్కార్యాలు అన్నీ కూడా ఇక్కడి వరకే అంతమైపోతాయి. స్వర్గంలో చేరిన తర్వాత అక్కడ మనకు నమాజ్ గాని, ఇంకా ఇట్లాంటి వేరే ఏ సత్కార్యాలు చేసుకోవడానికి ఉండదు. కానీ స్వర్గంలో మనం అల్లాహ్‌ను స్తుతిస్తూ ఉంటాము. అల్లాహ్‌ను పొగుడుతూ ఉంటాము. ఖురాన్‌లో సూరతుజ్ జుమర్‌లో చివర్లో చూడండి మీరు, అక్కడ కూడా ఈ విషయం అల్లాహ్ తాలా మనకు తెలియజేశాడు.
ఈ హదీస్ అర్థం చేసుకున్నారు కదా? అయితే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా హదీసులు, చాలా విషయాలు ఉన్నాయి. కానీ నేను ఇంతటితో ఈ విషయాన్ని ఇక్కడి వరకే ఆపేసి, అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహు తాలా మనందరికీ ఎల్లవేళల్లో అల్లాహ్‌ను అధికంగా, అధికంగా స్తుతిస్తూ, స్మరిస్తూ, అల్లాహ్ యొక్క జిక్ర్ అధికంగా చేస్తూ ఉండేటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక.
కానీ మీకు ఇష్టం ఉంది అంటే, కేవలం హింట్స్ మాదిరిగా కొన్ని విషయాలు చెబుతున్నాను, గమనించండి. అల్లాహ్ యొక్క స్మరణ ద్వారా నరకం నుండి రక్షణ ఉంది, స్వర్గంలో ప్రవేశం ఉంది. అల్లాహ్ యొక్క స్మరణ ద్వారా అల్లాహ్ యొక్క ప్రీతి, ప్రేమ అనేది మనకు లభిస్తూ ఉంది. ఈ అల్లాహ్ యొక్క స్మరణ ద్వారా మనకు ఎన్నో రకాలుగా పుణ్యాలు లభిస్తాయి. ఉమ్మె హాని (రదియల్లాహు అన్హా) హదీస్ గుర్తుంది కదా? సుబ్ హానల్లాహ్ అంటే, అల్ హందులిల్లాహ్ అని పలుకుతే, అల్లాహు అక్బర్ అని పలుకుతే, ఈ విధంగా వంద బానిసలకు, వంద ఒంటెలకు, వంద గుర్రాలకు, అవన్నీ గుర్తున్నాయి కదా? అంతే కాదు, మరి వేరే కొన్ని హదీసుల్లో చూస్తే, ఒక సామాన్య వ్యక్తికి అర్థమయ్యే విధంగా ఎలా ఉంది? ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చెట్టు వద్ద నిలబడ్డారు. ఏ చెట్టు? కొంచెం ఇలా దాన్ని కదిపితే ఆకులు రాలి పడుతున్నాయి. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు?
إن سبحان الله والحمد لله ولا إله إلا الله والله أكبر
ఇన్న సుబ్ హానల్లాహి వల్ హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్
(నిశ్చయంగా, అల్లాహ్ పవిత్రుడు, మరియు ప్రశంసలన్నీ అల్లాహ్ కే, మరియు అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, మరియు అల్లాహ్ గొప్పవాడు)
ఈ నాలుగు శుభ వచనాలు మీరు పలుకుతూ ఉంటే ఈ ఆకులు ఎలా రాలుతున్నాయో, మీ పాపాలు కూడా అలాగే రాలిపోతాయి అని తెలిపారు. అల్లాహు అక్బర్! పాపాల మన్నింపు కొరకు, పాపాల మన్నింపు కొరకు ఈ నాలుగు పదాలు పలుకుతూ ఉండడం కూడా ఎంత ముఖ్యం, ఎంత ముఖ్యం ఇది మనకు ఈ హదీస్ ద్వారా కూడా తెలుస్తూ ఉన్నది.
అంతే కాదు సోదర మహాశయులారా, మా యొక్క పుస్తకం ఏదైతే ఉందో, ‘పుణ్యాల త్రాసును ఎలా బరువు చేసుకోవాలి, సత్కార్యాలు’ అది ఇంతకు ముందు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పాను నేను. దాన్ని పంపడం కూడా జరిగింది. అందులో కూడా ఈ హదీస్ ప్రస్తావించాము. ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు?
మీరు యుద్ధంలో హాజరై శత్రువులతో పోరాడలేకపోతున్నారు, అంతటి పిరికితనం మీలో ఉంది. మరియు డబ్బు ధనాలు ఉన్నా గాని పిసినారితనం అనేది ఎంతవరకు ఉంది అంటే అల్లాహ్ మార్గంలో డబ్బు ఖర్చు చేయలేకపోతున్నారు. మరియు పొద్దంతా శ్రమించి రాత్రి ఎలా పడుకుంటున్నారు అంటే, నిలబడి కొన్ని రకాతులు చేయలేకపోతున్నారు. ఇంతటి మంచి కార్యాలలో ఒకవేళ మీరు మీలో ఉన్న కొన్ని లోపాల వల్ల, బలహీనతల వల్ల వెనకైపోతే, పుణ్యాలు సంపాదించుకునే విషయంలో వెనక కాకండి.
فليكثر
ఫల యుక్థిర్
(అధికంగా పలుకాలి)
గమనించండి ఇక్కడ కూడా, ఫల యుక్థిర్, అధికంగా పలుకాలి, అధికంగా పలుకాలి ఏంటి? లా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్, అల్ హందులిల్లాహ్, సుబ్ హానల్లాహ్. ఈ నాలుగు శుభ వచనాలు మీరు అధికంగా పలుకుతూ ఉన్నారంటే, వెండి, బంగారం మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టే దానికంటే ఎక్కువ ఘనత పొందగలుగుతారు, ఎక్కువ పుణ్యాలు పొందగలుగుతారు. షేఖ్ అల్బానీ (రహమతుల్లాహ్) ఈ హదీస్ ను సహీహ ఉత్తర్గీబ్‌లో ప్రస్తావించారు, ఒకటి ఐదు ఏడు ఒకటి హదీస్ నెంబర్ 1571.
సోదర మహాశయులారా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అల్లాహు తాలా విన్న కొన్ని విషయాలను అర్థం చేసుకొని, ఆచరించేటువంటి సద్భాగ్యం నాకు, మీకు, మనందరికీ ప్రసాదించు గాక. ఆమీన్.
وآخر دعوانا أن الحمد لله رب العالمين. السلام عليكم ورحمة الله وبركاته.
వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.
(మరియు మా చివరి ప్రార్థన, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే ప్రశంసలు. మరియు మీకు అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆశీర్వాదాలు కలుగుగాక.)
ప్రశ్న: అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్ షేఖ్.షేఖ్, ఇప్పుడు మామూలుగా సుబ్ హానల్లాహి, వల్ హందులిల్లాహి, అల్లాహు అక్బర్ అని ఇది వంద వంద సార్లు ఉంది కదా షేఖ్? ఇది రోజువారీ మన జీవితంలో చేసుకునేవా లేకపోతే ఇలాంటి జిల్ హిజ్జా మాసంలోని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేసేవా?
ఆన్సర్: అలైకుంస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. జీవితాంతం చేసేవి, ఇలాంటి ప్రత్యేక రోజుల్లో ఎక్కువగా చేసేవి. అంటే మనం రోజువారీ జీవితంలో కూడా ఇది మనం పాటించవచ్చును.
سبحانك اللهم وبحمدك أشهد أن لا إله إلا أنت أستغفرك وأتوب إليك. السلام عليكم ورحمة الله وبركاته.
సుబ్ హానకల్లాహుమ్మ వబిహందిక అష్ హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.
(ఓ అల్లాహ్, నీవు పవిత్రుడవు మరియు నీకే ప్రశంసలు. నీవు తప్ప మరో ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. నేను నిన్ను క్షమాపణ కోరుతున్నాను మరియు నీ వైపుకే పశ్చాత్తాపంతో మళ్ళుతున్నాను. మరియు మీకు అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆశీర్వాదాలు కలుగుగాక.)